ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సారి వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన యువతకు పెద్దపీట వేస్తానని చెబుతున్నారు. ముందు 30 శాతం.. తర్వాత ఈ ఏడాది మేలో జరిగిన మహానాడులో 40 శాతం మేరకు..యువతకు టికెట్లు ఇస్తామని.. అంతేశాతం పార్టీలోనూ పదవులు ఇస్తామని ప్రకటించారు.
యువత పెద్ద ఎత్తున స్పందించి.. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంటే.. మొత్తంగా యువతను ప్రోత్సహించేందుకు చంద్రబాబురెడీగానే ఉన్నారు. 40 శాతం సీట్లు అంటే .. ఉన్న 175 నియోజవకర్గాల్లో దాదాపు 70 మంది యువ నేతలకు ఆయన టికెట్లు ఇస్తామని చెప్పారు. ఇది చిన్న సంఖ్యేమీ కాదు. దీంతో ఇప్పటి వరకు అంతో ఇంతో స్పందిస్తున్న యువత మరింత పుంజుకుంటారని చంద్రబాబు ఆశించారు.
కానీ, చంద్రబాబు ఆశించినట్టు క్షేత్రస్థాయిలో పరిస్థితి కనిపించడం లేదు. యువత ఎక్కడా స్పందించడం లేదు. క్షేత్రస్థాయిలో పర్యటించడమూ లేదు. ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం కూడా లేదు. ఇది పక్కా వాస్తవం. దీనిపై ఇటీవల ఎన్టీఆర్ భవన్‌లో సుదీర్ఘంగా చర్చించారని సీనియర్లు కూడా చెప్పారు. మరి దీనికి కారణాలు ఏంటి? ఎందుకు? చంద్రబాబు ప్రకటన చేసిన తర్వాత.. కూడా మౌనంగా ఉండిపోవడానికి రీజనేంటి? అనేది ఆసక్తిగా మారింది.
దీనికి యువ నాయకుల్లో టికెట్ల భరోసా కలగడం లేదని అంటున్నారు. ఉదాహరణకు అనంతపురం, శ్రీకాకుళంలో చోటు చేసుకున్న ఘటనలు దీనికి ఉదాహరణగా సీనియర్లు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో ప్రతిభా భారతి వారసురాలు గ్రీష్మ దూకుడుగా ఉన్నారు. అయితే, ఆమెకు టికెట్ ఇచ్చేది లేదని.. కొన్నాళ్ల కిందటే చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇక, అనంతపురంలో జేసీ బ్రదర్స్ వారసులకు కూడా ఈ సారిటికెట్లు లేవని చూచాయగా చెప్పేశారు.
అదేసమయంలో రాప్తాడు నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పరిటాల శ్రీరాంకు టికెట్లు ఇచ్చేదిలేనిదీ తేల్చి చెప్పలేదు. ప్రస్తుతానికి రాప్తాడు టికెట్‌ను పరిటాల సునీతకే కన్ఫర్మ్ చేశారు. తనకు ధర్మవరం టికెట్ ఇవ్వాలని శ్రీరాం కోరుతున్నా.. స్పందించడం లేదని చెబుతున్నారు. ఈ పరిణామాలతో నే.. మిగిలిన యువ నేతలు పెద్దగా స్పందించడం లేదని సీనియర్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.