తెలంగాణలో బీజేపీకి జోష్ పెంచిన నేతగా బండి సంజయ్‌ను చెప్పుకోవచ్చు. 2020 మార్చిలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తన మాటల్లో, చేతల్లో దూకుడు ప్రదర్శిస్తూ పార్టీని పరుగులు పెట్టించారు. రాష్ట్రంలో పార్టీని విస్తరించే ప్రయత్నాలు చేశారు. గ్రామ స్థాయి నుంచి క్యాడర్‌ను బలోపేతం చేయడంలో కాస్త సఫలమయ్యారు. కానీ ఈ ఏడాది రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్ ఉంటే పని కాదని అనుకున్న బీజేపీ అధిష్ఠానం.. ఆయన స్థానంలో కిషన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించింది.
రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తప్పించడం ఊహించని పరిణామమే. దీంతో ఆయన వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రధాని సభలోనూ, కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో సంజయ్‌కు గొప్ప స్పందన వచ్చింది. దీంతో సంజయ్‌ను తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించి.. నష్ట నివారణ చర్యలకు అధిష్ఠానం పూనుకుంది. దీంతో ఆయన వర్గం ఏ మేరకు సంతృప్తి చెందుతుందనే విషయం పక్కనపెడితే.. బండి సంజయ్ మాత్రం పైకి సానుకూలంగానే స్పందించారు.
ఇక పార్టీ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ ఓ రాష్ట్రంలో పార్టీ ఇంఛార్జీగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రధాన కార్యదర్శులుగా రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలను అధిష్ఠానం అప్పగిస్తోంది. ఈ క్రమంలో బండి సంజయ్‌ను ఏ రాష్ట్రానికి ఇంఛార్జీగా నియమిస్తారోననే ఆసక్తి కలుగుతోంది. అయితే ఏపీ బాధ్యతలు చూసే సునీల్ దేవధర్‌ను కార్యదర్శి పదవి నుంచి పార్టీ తప్పించింది. దీంతో ఏపీ బాధ్యతలను ఆయన కోల్పోనున్నారు. ఇప్పుడు సునీల్ స్థానంలో బండి సంజయ్‌ను ఏపీకి ఇంఛార్జీగా నియమిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదే జరిగితే.. తన వ్యూహాలు, ప్రణాళికలతో ఏపీలోనూ బండి దూకుడుతో పార్టీలో జోష్ పెంచే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates