రాహుల్ గాంధి తనను తాను పరిపక్వత కలిగిన నాయకుడిగా నిరూపించుకునేందుకు భారత జోడో యాత్ర చేసిన విషయం తెలిసిందే. భారత జోడోయాత్ర పేరుతో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాహుల్ చేసిన పాదయాత్ర ఒకరకంగా కాంగ్రెస్ పార్టీకి లాభించిందనే చెప్పాలి. మొదటిది రాహుల్ రాజకీయ శైలిలో బాగా మార్పొచ్చింది. రెండు పాదయాత్ర జరిగిన రూటులో ఉన్న కర్నాటక ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చింది.
రాహుల్ యాత్ర వల్ల కర్ణాటకలో అధికారంలోకి రాకపోయినా నేతలందరినీ యాత్ర ఏకతాటిపైకి తెచ్చిందన్నది వాస్తవం. దాంతోనే ఎన్నికల్లో సీనియర్లంతా ఐకమత్యంతో బీజేపీ పై పోరాడి మంచి విజయాన్ని సాధించారు. కర్నాటక ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ పార్టీలో మంచి ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా గెలుపు సాధించాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. నవంబర్-డిసెంబర్లో తెలంగాణా, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మణిపూర్లో ఎన్నికలు జరగాల్సుంది.
వీటిల్లో పెద్ద రాష్ట్రాలు కాబట్టే తెలంగాణా, మధ్యప్రదేశ్, రాజస్ధాన్ మీదే అందరి దృష్టి ఉంది. మణిపూర్లో జరగుతన్న అల్లర్ల నేపధ్యంలో అక్కడ ఎన్నికలు జరిగేది అనుమానమే. అందుకనే మిగిలిన నాలుగు రాష్ట్రాలను నాలుగు యూనిట్లుగా తీసుకుని రాహూల్ యాత్ర మొదలుపెడితే ఎలాగుంటందనే చర్చ పార్టీలో మొదలైంది. యాత్ర చేయటానికి రాహుల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకనే యాత్ర ప్రారంభం, రూటుమ్యాప్ తదితరాలపై దిగ్విజయ్ సింగ్ ఆధ్వర్యంలోని సీనియర్ నేతల కమిటి సమావేశమైంది.
నవంబర్, డిసెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆలోగానే భారత్ జోబోయాత్ర-2.0ని మొదలుపెట్టాలని కమిటి సూత్రప్రాయంగా నిర్ణయించింది. వాతావరణం, రూటుమ్యాపు తదితరాలపై చర్చించిన తర్వాత ఆ వివరాలను రాహుల్ తో దిగ్విజయ్ చర్చించబోతున్నారు. పాదయాత్ర తర్వాత మామూలు జనాలతో రాహుల్ మమేకమైపోయే స్టైల్ మారిపోయింది. దాబా హోటళ్ళు, మెకానిక్ షెడ్లు, వీధి పక్కనే టిఫెన్ బండ్లు, మామూలు హోటళ్ళు, లారీల్లో ప్రయాణం తదితరాలతో మామూలు జనాలతో రాహుల్ మాట్లాడుతున్నారు. మరి భారత జోడో యాత్ర-2.0 ప్రభావం ఎలాగుంటుందో చూడాలి.