ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ పొత్తు నిర్విఘ్నంగా కొనసాగుతోంది. వాస్తవానికి ఏపీ వరకే ఈ పొత్తు కుదుర్చుకుని ఎన్నికలకు వెళ్లినా.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలోనూ ఏపీలో ఏర్పడిన కూటమి కీలక పాత్ర పోషిస్తోంది. గత 2014, 2019 ఎన్నికల్లో ఒంటరిగానే బలాన్ని పుంజుకుని కేంద్రంలో పాగావేసిన బీజేపీ.. ఈ సారి మాత్రం బలహీన పడింది. ఇలాంటి సమయంలో ఏపీ లో కుదుర్చుకున్న పొత్తు పదిలంగా ఉపయోగపడింది. మోడీని మూడోసారి ప్రధానిని కూడా చేసింది.
ఇక, రాష్ట్రం విషయానికి వస్తే.. ఇక్కడ కూడా మూడు పార్టీలు కలిసి ముందుకు సాగుతున్నాయి. నాయకుల మధ్య సయోధ్య, పార్టీల మధ్య సమన్వయం వంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిన్న చిన్న అవాంతరాలు మినహా.. మూడు పార్టీల మధ్య సంబంధ బాంధవ్యాలు కూడా బాగానే ఉన్నాయి. పార్టీలు వేరైనా.. ప్రభుత్వాన్ని నడిపించే విషయంలో నాయకులు కలిసి కట్టుగా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటున్నారు. జీఎస్టీ నుంచి అమరావతి పునర్నిర్మాణం వరకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించి.. పొత్తుకు పెద్ద పీట వేస్తున్నారు.
ఇక, వచ్చే 15 ఏళ్లపాటు కూడా ఈ పొత్తు కొనసాగుతుందని స్వయంగా అటు చంద్రబాబు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు చెబుతున్నారు. దీనిపై ఎవరికీ అనుమానాలు కూడా లేవు. ఎందుకంటే.. తేడాలు వస్తే.. అగ్రనేతల మధ్యే రావాలి. అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. రాదన్న సంకేతాలు కూడా వస్తున్నాయి. ఇక, క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య కలివిడి లేకపోతే.. అది వారికే నష్టం తప్ప.. పార్టీలకు కాదు. కూటమికి అంతకన్నా కాదు. ఎవరైనా నాయకుల బలంతోనూ.. పార్టీల అండదండలతోనే విజయం దక్కించుకున్నారు. సో.. ఇప్పట్లో కూటమికి ఎలాంటి జంకు.. బెరుకు ఉండాల్సిన అవసరం లేదనేది స్పష్టమవుతోంది.
ఇలాంటి సమయంలో అనూహ్యంగా మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ పొత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం వైసీపీని ఓడించేందుకు.. జగన్‌ను ఇంటికి పరిమితం చేసేందుకు ఏర్పడిన పొత్తుగా అభివర్ణించారు. ఇదే నిజమైతే.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. జగన్‌ను ఇంటికి పరిమితం చేసిన తర్వాత.. ఎవరి దారి వారు చూసుకునేవారు. పదవులకోసం కొట్లాటలు పెట్టుకునేవారు. కానీ.. అలా జరగలేదు. ఇది రాష్ట్రం కోసం.. రాష్ట్ర ప్రజల భవితవ్యం కోసం పెట్టుకున్న పొత్తు కాబట్టే బలంగా నిలబడిందన్న వాస్తవాన్ని ఉండవల్లి విస్మరించినట్టు వున్నారు.
ఇక, ఇదే సమయంలో మరో కామెంటు కూడా చేశారు. “ఈ పొత్తు ఎన్నాళ్లు ఉంటుందో చూడాలి“ అని!. కానీ.. వాస్తవానికి పొత్తు పెట్టుకున్న పార్టీలే 15 ఏళ్లు ఖచ్చితంగా నికరంగ ఉంటామని చెబుతున్న నేపథ్యంలో ఉండవల్లికి డౌటానుమానం ఎందుకన్నది పరిశీలకుల మాట!
Gulte Telugu Telugu Political and Movie News Updates