కాంగ్రెస్ దూకుడుకు బ్రేకులు.. న‌ష్ట‌పోయేదెవ‌రు..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు నిలువ‌రించే వారుక‌నిపించ‌డం లేదా? ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావాల‌ని ద్రుఢంగా ఉన్న‌ప్ప‌టికీ.. ఆ దిశ‌గా చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డం లేదా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. పార్టీ చీఫ్‌పై అంత‌ర్గ‌త విభేదాలు ఇంకా చ‌ల్లార‌లేదు. రేవంత్‌రెడ్డితో క‌లిసి ముందుకు సాగాల‌న్న అధిష్ఠానం సూచ‌న‌లు కూడా కేవ‌లం నామ‌మాత్రంగా మారిపోయాయి. దీనికితోడు.. ఎవ‌రికివారే టికెట్లు ప్ర‌క‌టించుకోవ‌డం.. మ‌రింత గంద‌ర‌గోళంగా మారింది.

నిజానికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో సింప‌తీని చూపించి గెలుపు గుర్రం ఎక్కాల‌ని పార్టీ బావిస్తోంది. తెలంగాణ ఇచ్చింది మేమే.. అంటూ.. అనేక సంద‌ర్భాల్లో అధిష్టానం ప్ర‌క‌టించింది. ఈ నినాదాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌ని కూడా చెబుతోంది. అయితే.. కొన్నాళ్లు ఈ నినాదం తీసుకువెళ్లినా.. మ‌ళ్లీ నాయ‌కులు మ‌రిచిపోయారు. అంతేకాదు.. రేవంత్‌కు చెక్‌పెడుతూ.. బీసీ ముఖ్య‌మంత్రి నినాదాన్ని తెర‌మీదికి తెచ్చారు. ఇది పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.

కొన్నాళ్ల కింద‌ట ఎస్టీ ఎమ్మెల్యే సీత‌క్క‌ను సీఎం చేస్తే త‌ప్పేంటంటూ.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఆయ‌న వ్యూహాత్మ‌కంగా త‌మ‌కు చెక్ పెట్టార‌ని భావిస్తున్న కొంద‌రు నేత‌లు.. రేవంత్‌ను ఇరుకున పెట్టేలా.. బీసీ మంత్రం ప‌ఠిస్తున్నారు. బీసీ అభ్య‌ర్థికి అవకాశం ఎందుకు ఇవ్వ‌కూడ‌దు.. అంటూ.. కొంద‌రు నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. అంటే.. మొత్తంగా నాయ‌కుల ఆలోచ‌న ఆలు.. లేదు.. చూలు లేదు.. అన్న సామెత‌ను త‌ల‌పిస్తోంది.

ఇంకొంద‌రు త‌మ స‌త్తా చూపించుకునేందుకు వ్య‌క్తిగ‌త ఇమేజ్‌ను పెంచుకునేందుకు సొంత కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. ఇది కూడా పార్టీలో నేత‌ల‌కు నేత‌ల‌కు మ‌ధ్య విభేదాల‌ను తెర‌మీద‌కి తెస్తోంది. దీంతో ఈ ప‌రిణామం.. కాంగ్రెస్ దూకుడుకు బ్రేకులు వేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.. ఈ ప‌రిస్థితి నుంచి పార్టీ అధిగ‌మించి.. ప్ర‌జ‌ల్లో త‌మ‌ను తాము బ‌లోపేతం చేసుకోక‌పోతే.. చేజేతులా మ‌రోసారి ప్ర‌తిప‌క్షానికే ప‌రిమితం కావ‌ల్సి ఉంటుందని హెచ్చ‌రిస్తున్నారు.