ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో తాజాగా జరిగిన ఘర్షణలో ఇటు టీడీపీ, అటు వైసీపీ లకు చెందిన కార్యకర్తలు పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. వీరు ప్రస్తుతం స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక, ఆయా ఆసుపత్రులకు నాయకులు వెళ్లి పరామర్శల యాత్రలుచేస్తున్నారు. అయితే.. వాస్తవానికి ఇంత మంది కార్యకర్తలు.. తీవ్ర గాయాలపాలు కావడానికి ఎవరిది తప్పు? అనే చర్చ స్థానికంగా తెరమీదికి వచ్చింది.
గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు, అదే ఎన్నికల్లో ఓడిపోయిన జీవీ ఆంజనేయులు మధ్య రాజకీయ వైరమే కాకుండా.. వ్యక్తిగత స్పర్థలు కూడా ఉన్నాయి. ఇవి వైసీపీకి ముందు నుంచి కూడా కొనసాగుతున్నాయి. గతంలో బొల్లా కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు.. జీవీ టీడీపీలో తొలిసారి టికెట్ దక్కించుకున్నప్పటి నుంచి కూడా ఈ వివాదాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఇటీవల కాలంలో ఎన్నికల వేడి పెరిగింది.
వచ్చే ఎన్నికల్లో ఇరు పక్షాలు కూడా విజయం దక్కించుకుని తీరాలనే పట్టుదలతో ఉన్నాయి. ఇది రాజకీయంగా ఎవరి వ్యూహాలు వారికి ఉండడం తప్పు కాదు. అయితే.. ఇరు పక్షాలు కూడా.. వారి వారి కార్యకర్తలను రెచ్చగొట్టడంలో సక్సెస్ అయిన ఫలితంగానే ఇప్పుడు కార్యకర్తలు ఇంత పెద్ద సంఖ్యలో గాయపడ్డారనేది స్థానికంగా నాయకులు చెబుతున్న మాట. వైసీపీపై టీడీపీ, టీడీపీపై వైసీపీ విమర్శలు గుప్పిస్తున్నాయి.
అయితే, క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు పదువుల ఆశ చూపించారని, ఎన్నికల్లో మరోసారి గెలిస్తే.. నామినేటెడ్ పదవులు ఇప్పిస్తామని.. వైసీపీ నేత, గెలుపు గుర్రం ఎక్కకపోతే.. మనకు నష్టమని.. టీడీపీ నేత నూరిపోసిన నేపథ్యంలో కార్యకర్తలు అంతిమంగా బాధితులు అయ్యారని అంటున్నారు. “నాయకులు, నాయకులు బాగానే ఉన్నారు. ఇప్పుడు కార్యకర్తలపై కేసులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఆసుపత్రుల్లో ఉన్నారు. కూలికెళ్తే తప్ప పూట గడవదు” అని బాధితుడి తల్లి ఆవేదన వ్యక్తం చేయడం.. కార్యకర్తల పరిస్థితికి అద్దం పట్టింది.