అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో ఆంధ్రప్రదేశ్‌లో జనసేన దూకుడు ప్రదర్శిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలనే పట్టుదలతో ఆ పార్టీ సాగుతోంది. ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. ఎన్నికల్లో టీడీపీతోనూ కలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటు ఎలా అనే ప్రశ్నలు కలుగుతున్నాయి. కానీ జనసేన మాత్రం తాను కోరుకున్న నియోజకవర్గాల్లో కచ్చితంగా పోటీ చేసేలా కనిపిస్తోంది. ఇందులో తిరుపతి నియోజకవర్గంపై జనసేన ప్రత్యేక దృష్టి సారించింది.
తప్పక గెలుస్తామని జనసేన ఆశలు పెట్టుకున్న నియోజకవర్గాల్లో తిరుపతి ఒకటి. 2009లో ప్రజారాజ్యం తరపున చిరంజీవి ఇక్కడి నుంచే గెలిచారు. పవన్ కల్యాణ్ సామాజిక వర్గం ఇక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. దీంతో విజయంపై జనసేన ధీమాతో ఉంది. ఈ నేపథ్యంలో అధినేత పవన్ ఇక్కడి నుంచే పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఆయన కోస్తా నుంచే బరిలో దిగనున్నారని వారాహి యాత్రతో తేలిపోయింది. ఇక తిరుపతి ఎవరికి? అనే ప్రశ్న మొదలైంది.
పవన్ పోటీ చేయకపోతే తిరుపతి టికెట్ తనకు దక్కుతుందని కిరణ్ రాయల్ అంటున్నారు. కానీ ఆయనపై అవినీతి ఆరోపణలున్నాయని వ్యతిరేక వర్గం చెబుతోంది. దీంతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్‌కే కచ్చితంగా టికెట్ వస్తుందని ఆయన అనుచర వర్గం పెద్ద ఎత్తున ప్రచారం మొదలెట్టింది. వచ్చే ఎన్నికల్లో హరిప్రసాద్ నిలబడడంతో పాటు గెలుస్తారని సామాజిక మాధ్యమాలను ప్రచారంతో ఉపేస్తున్నారు. ప్రస్తుత పరిణామలు చూస్తుంటే ఆయనకే టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. మరి పవన్ మనుసులో ఏముందో? తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates