తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే బాటసింగారంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన కార్యక్రమానికి బీజేపీ పిలుపునిచ్చింది. అయితే, ఆ వ్యవహారం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆ పరిశీలనకు వెళ్లకుండా బీజేపీ నేతలు ఈటల రాజేందర్, డీకే అరుణ తదితరరులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వారిద్దరూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
మరోవైపు, ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేరుగా బాటసింగారానికి బయల్దేరారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇతర బీజేపీ నేతలు ఉన్నారు. ఈ క్రమంలోనే వారి వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో కిషన్ రెడ్డి, రఘునందన్, ఇతర నేతలు భారీ వర్షంలోనే రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర మంత్రి అయిన తన వాహనాన్ని అడ్డుకుంటారా? అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కమిషనర్ ఘటనా స్థలానికి వచ్చినా కిషన్ రెడ్డి…బాట సింగారానికి వెళ్తానని పట్టుబట్టారు.
ఈ క్రమంలోనే ఎట్టకేలకు కిషన్ రెడ్డి, రఘునందన్ రావు లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో, పోలీసులు, ప్రభుత్వంపై కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ ఘటనతో శంషాబాద్ పరిసర ప్రాంతానికి భారీగా బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు చేరుకుంటున్నాయి. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు, తన హౌస్ అరెస్ట్ పై ఈటల రాజేందర్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంటుందన్నారు. విపక్ష నేతలను అదుపులోకి తీసుకోవడం ప్రభుత్వానికి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తమను గృహ నిర్బంధం చేసినంత మాత్రాన తమ పోరాటం ఆగదని అన్నారు.