సంచలనంగా మారిన చినరాజప్ప క్వశ్చన్లు

ప్రశ్నలు ఎవరైనా వేయొచ్చు. కానీ.. అందులో పస ఉండాలి. నిత్యం గంటల కొద్దీ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే బాబు మాటల్లో పస కంటే ఎక్కువగా నస ఉంటుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అందుకు భిన్నంగా టీడీపీకి చెందిన కొందరు నేతల మాటలు సూటిగా.. స్పష్టంగా ఉంటాయి. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారు ఏపీ మాజీ హోం మంత్రిగా వ్యవహరించిన నిమ్మకాయల చినరాజప్ప. చాలా తక్కువ సందర్భాల్లోనే రియాక్టు అవుతారన్న ఇమేజ్ ఉన్న ఆయన.. తాజాగా ఏపీ పోలీస్ బాస్ కు ఒక బహిరంగ లేఖ రాశారు.

ఇందులో ఆయన సంధించిన ప్రశ్నలు ఇప్పుడు సంచలనంగా మారాయి. వాస్తవానికి దగ్గరగా.. కొద్దిమందిలో ఉన్న అభిప్రాయాల్ని.. వాదనలకు అనువుగా ప్రశ్నలు ఉన్నాయని చెప్ప తప్పదు. ఆయన ప్రశ్నలు జగన్ ప్రభుత్వానికి కాస్తంత ఇబ్బంది కలిగించేలా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. ఆయన సంధించిన బోలెడన్ని ప్రశ్నల్లో.. ఆసక్తికరంగా ఉన్న వాటిని చూస్తే..

  • అనుమతి తీసుకొని విశాఖకు వెళ్లారు చంద్రబాబు. ఆయన్ను అడ్డుకోవటానికి విశాఖ ఎయిర్ పోర్టుకు వందల మంది జగన్ పార్టీ కార్యకర్తలు ఎలా వచ్చారు? టీడీపీ కార్యకర్తల్ని కట్టడి చేయగలిగిన పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూండాల్ని ఎందుకు కట్టడి చేయలేకపోయారు?
  • గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన బాడీ కెమేరాల్ని ఇప్పుడెందుకు తీసేశారు? అవే ఉంటే శిరోముండనం.. కిరణ్ కుమార్ హత్య.. డాక్టర్ సుధాకర్ మీద అమానుషం జరిగేదా?
  • వైఎస్ వివేక హత్య దర్యాప్తు ఎందుకు పూర్తి కాలేదు? ముఖ్యమంత్రి జగన్ సోదరే స్వయంగా ఏపీ పోలీసులపై నమ్మకం లేదనే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉన్నత న్యాయస్థానం సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించింది?
  • మోకా భాస్కరరావు హత్య వ్యక్తిగత తగాదాతో జరిగిందని మచిలీపట్నంలోని అందరికి తెలుసు. హత్య జరిగిన సమయంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అధికారుల వద్దనే ఉన్నారు. ఆయనకు నేర చరిత్ర లేదు. అయినా.. కొల్లు మీద కేసు పెట్టిన పోలీసులు..కాసు మహేశ్ రెడ్డిపై ఎందుకు పెట్టలేదు?
  • హైదరాబాద్ లో ఉన్న ఎస్సీ యువకుడు విక్రమ్ ను పోలీసులు పిలిపించారు. అతడికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? విక్రమ్ హత్యకు ప్రేరేపించిన గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు?
  • తన ఎదుట ఉన్న సీఐ దళిత అధికారి అని జేసి ప్రభాకర్ రెడ్డికి ఎలా తెలుసు? కరోనా నిబంధనలు ఉల్లంఘించారని జైలు నుంచి విడుదలైన 24 గంటల్లోనే ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేశారు. మరి.. కాళహస్తి.. నగరి.. పలమనేరు ఎమ్మెల్యేలు.. విజయసాయి.. స్పీకర్ తమ్మినేనితో సహా పలువురు నిబంధనలు ఉల్లంఘించారు. పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆధారాలు ఉన్నా కేసులు ఎందుకు పెట్టటం లేదు?
  • గుంటూరు 1 ఎమ్మెల్యే షెడ్డులో చట్టవిరుద్ధంగా గుట్కా తయారీ జరిగింది. అందులో మంగళగిరి ఎమ్మెల్యే బంధువు పాత్ర ఉందని వార్తలు వచ్చినా.. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోలేదేం?
  • దళిత జడ్జి రామక్రిష్ణ ను కించపరుస్తూ బహిరంగ ప్రకటన చేసిన మంత్రి పెద్దిరెడ్డిపై ఎందుకు కేసు నమోదు చేయలేదు?
  • సోషల్ మీడియాలో పోస్టు ఫార్వర్డ్ చేశారని విశాఖకు చెందిన 65 ఏళ్ల నందకిశోర్ పై అక్రమ కేసు పెట్టటమే కాదు.. ఆయన్ను వందలాది కిలోమీటర్లుతిప్పి కర్నూలు కోర్టులో ఎందుకు పెట్టారు? పోలీసుల వేధింపుల కారణంగానే ఆయన మరణించలేదా?
  • ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ.. విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనురాధలు ఇచ్చిన కంప్లైంట్లపై ఏం చర్యలు తీసుకున్నారు?
  • హైకోర్టు న్యాయమూర్తిని దారుణంగా దూషిస్తూ పోస్టు పెట్టిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?
  • మాజీ మంత్రి ఆయన్నపాత్రుడి తాత ఫోటోను అక్రమంగా మున్సిపల్ కార్యలయంలో తొలగించారు. దానిపై భావోద్వేగానికి ఆయన గురైతే.. దిశ చట్టం కింద కేసు పెట్టటం ఏమిటి?
  • పెళ్లికి వెళ్లిన మాజీ మంత్రి యనమల.. నా మీద అట్రాసిటీ కేసులు ఎందుకు పెట్టినట్లు?
  • రాజధాని గ్రామాల్లో బాలింతను బూటు కాలితో తన్నటం చట్ట సమ్మతమేనా? గ్రామాల్లో వందలాది మంది పోలీసులతో కవాతు ఏమిటని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించలేదా?