ఎన్డీఏ కూటమి పార్టీల సమావేశానికి ఏపీ నుంచి జనసేనకు మాత్రమే ఆహ్వానం అందిన సంగతి తెలిసిందే. అయితే, గతంలో ఎన్డీఏలో ఉండి ఆ తర్వాత బయటకు వచ్చిన టీడీపీకి మాత్రం కమలనాథుల నుంచి కబురందలేదు. దీంతో, బీజేపీ-జనసేనల మధ్య పొత్తు ఖాయమని, టీడీపీ విడిగానే పోటీ చేయబోతోందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరైన పవన్ కల్యాణ్ ఏపీలో పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే పోటీచేసే అవకాశముందని పవన్ అన్నారు. జాతీయ మీడియాతో మాట్లాడిన పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ, బీజేపీ, జనసేన 2014లో కలిసి పోటీ చేశాయని, కానీ, 2019లో విడిపోయామని అన్నారు. కానీ, 2019 ఎన్నికల తర్వాత బీజేపీ, జనసేన కలిశాయని, టీడీపీ, బీజేపీల మధ్య మాత్రం అండర్‌స్టాడింగ్ ఇష్యూ ఉందని పవన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే, వాళ్ల సమస్యలపై తాను మాట్లాడటం సరికాదని పవన్ అన్నారు. అయితే, ఆ ఇష్యూస్ సెటిల్ చేసుకొని రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా కలిసి పోటీ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
సీఎం అభ్యర్థి ఎవరన్న వ్యవహారంపై కూడా పవన్ స్పందించారు.. సీఎం ఎవరనేది సమస్య కాదని, అయితే, జనసేన కేడర్ తనను సీఎంగా చూడాలనుకుంటోందని చెప్పారు. కానీ, క్షేత్రస్థాయిలో బలాబలాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని పవన్ చెప్పారు. ఎన్నికల సమయంలో సీఎం అభ్యర్ధి ఎవరు అన్న విషయంపై క్లారిటీ వస్తుందన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూడడం, వైసీపీని ఓడించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు.
ఆధార్ డేటా వ్యక్తిగత గోప్యతకు భంగం అని చర్చ జరుగుతున్న సమయంలో 5 వేల రూపాయల జీతానికి ప్రజల డేటాను ప్రైవేటు వ్యక్తులు సేకరిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉందని, మౌలిక వసతులు పూర్తిగా లేవని, రైతులకు మద్దతు ధర రావడం లేదని పవన్ ఆరోపించారు. ఉద్యోగులకు సక్రమంగా జీతాలు రావడం లేదని, వాటిపై ప్రశ్నించడానికి జనసేన ముందుకోచ్చిందని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates