ఏపీలో ప్రెసిడెంట్ మెడ‌ల్.. పేలుతున్న జోకులు

‘‘మీ కొడుకు ప్రెసిడెంట్ మెడ‌ల్ తీసుకున్నాడండీ’’.. అన్నాడొకాయ‌.
‘‘అవునా నిజ‌మా. ఎంత మంచి వార్త చెప్పారు. నాకు తెలుసు వాడు ప్ర‌యోజ‌కుడ‌వుతాడ‌ని. ఇప్పుడు వాడెక్క‌డ‌?’’.. మురిసిపోతూ అడిగింది ఒకావిడ‌.
‘‘ప‌క్క సందులో వైన్ షాప్ ద‌గ్గ‌ర ప‌డున్నాడు వెళ్లి తీసుకురండి’’.. అని బదులిచ్చారాయ‌న‌.

ఇదీ సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తున్న ప్రెసిడెంట్ మెడ‌ల్ జోకుల్లో ఒక‌టి. ఇంత‌కీ ఏంటీ ప్రెసిడెంట్ మెడ‌ల్.. దానికి వైన్ షాపుతో సంబంధం ఏంటి అని ఆశ్చ‌ర్యం క‌లుగుతోందా? ఏపీలో మందు బాబులంద‌రికీ ఈ పేరు బాగానే సుప‌రిచితం ఇప్పుడు. అది ఈ మ‌ధ్యే ఏపీలోకి అరంగేట్రం చేసిన‌ ఓ మ‌ద్యం బ్రాండు పేరు. దీని మీద కొన్ని రోజులుగా అనేక జోకులు వ‌స్తున్నాయి. మీమ్స్ త‌యార‌వుతున్నాయి.

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇచ్చిన‌ మ‌ద్య‌‌పాన నిషేధం హామీ సంగ‌తేమో కానీ.. ఏపీలో ఇప్ప‌టిదాకా ఉన్న మ‌ద్యం బ్రాండ్ల‌న్నీ ప‌క్క‌న పెట్టేసి అన్నీ లోక‌ల్ బ్రాండ్ల‌తోనే నింపేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టిదాకా క‌నీ వినీ ఎరుగ‌ని ఎన్నో లోక‌ల్ బ్రాండ్లు ఇప్పుడ‌క్క‌డ హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. ఏదో ఒక లేబుల్ వేయ‌డం.. ఇష్ట‌మొచ్చిన రేటు పెట్ట‌డం.. అమ్మేసేయ‌డం.. ఇదీ వ‌ర‌స‌.

అస‌లే మ‌ద్యం ధ‌ర‌లు 75 శాతం పెంచారు. పైగా ఊరూ పేరు లేని బ్రాండ్లు తెచ్చిపెట్టారు. దీంతో మందు బాబుల క‌ష్టం మామూలుగా లేదు. వాళ్ల వైపు వ‌కాల్తా పుచ్చుకోవ‌డం కాదు కానీ.. ఈ బ్రాండ్ల విష‌యంలో అంద‌రిలోనూ తీవ్ర వ్య‌తిరేకత వ్య‌క్త‌మ‌వుతోంది. ఇది మందుబాబుల స‌మ‌స్య కావ‌డంతో ఎవ‌రూ ప‌ట్టించుకునే వారు లేక‌పోయారు.