చంద్రబాబును వెంటాడుతోన్న ఢిల్లీ దీక్ష

పదవిలో ఉన్నపుడు అవకాశం ఉన్నంతవరకు అధికారాన్ని వాడేందుకు చాలామంది నేతలు మొగ్గుచూపుతారు. పవర్ లో ఉన్నపుడు చలాయింపు ధోరణి….ఏం చేసినా అడిగేవారుండరన్న ధీమా చాలామంది రాజకీయ నేతల్లో ఉంటుంది. ఈ క్రమంలోనే చాలామంది రాజకీయ నాయకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుంటారు. అయితే, ఆ విషయాలను పెద్దగా ఎవరూ పట్టించుకోరు కాబట్టి ప్రజా ప్రతినిధులు…ఈ దుబారా ఖర్చు గురించి లెక్కలు చెప్పాల్సిన అవసరం దాదాపుగా రాదు. అయితే, కొన్ని సార్లు పవర్ లో ఉన్నపుడు చేసిన దుబారా ఖర్చు..కొందరు నేతలను వెంటాడుతూనే ఉంటుంది. తాజాగా, ఏపీ మాజీ సీఎం చంద్రబాబును కూడా ఆ తరహాలోని ఓ దుబారా ఖర్చు వెంటాడుతోంది. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన ధర్మ పోరాట దీక్ష తాలూకు ఖర్చు ఇప్పటికీ నీడలా వెంటాడుతోంది. ఆ దీక్షకు ఖర్చు చేసిన నిధులపై తాజాగా లోకాయుక్తలో ఏవీ రమణ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఈ దీక్షకు రూ.7.5 కోట్ల ప్రజాధనం దుర్వినయోగం చేశారని ఫిర్యాదులో రమణ ఆరోపించారు.

2019లో చంద్రబాబు సీఎం హోదాలో ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేశారు. ఈ దీక్ష కోసం ఏపీ నుంచి ఢిల్లీకి ప్రత్యేకంగా రైళ్లను నడిపారు. దీంతోపాటు, బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ జతకూర్చే ప్రయత్నంలో ఆయా పార్టీల నేతల్ని దీక్షకు ఆహ్వానించారు. బీజేపీ, ప్రధాని మోడీపై నిప్పులు చెరిగారు. అయితే, ప్రజాధనాన్ని రాజకీయాల కోసం దుర్వినియోగం చేయడంపై ఆనాడే బీజేపీ,వై‌సీపీ ఆరోపించాయి. ఈ నేపథ్యంలోనే ఆ అంశంపై జులై 4న లోకాయుక్తకు ఫిర్యాదు చేయగా తాజాగా ఆగస్టు 7న కేసు నమోదైంది. ఈ కేసు విచారణ అక్టోబరు 1, 2020 నాటికి వాయిదా పడింది. దీంతోపాటుట, టీడీపీ హయాంలో అవినీతిపై విచారణ జరపాలని కూడా లోకాయుక్తలో ఫిర్యాదు నమోదైన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదులపై లోకాయుక్త ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.