శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు సాయిని సీఐ అంజూ యాదవ్ చెంపదెబ్బ కొట్టిన సంగతి పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తణుకు సభతో పాటు పలు సందర్భాల్లో మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే సోమవారం నాడు ఆయన శ్రీకాళహస్తిలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.
శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడిపై చేయి పడిందని, జనసేన నేత పై చేయి పడింది అంటే అది తనపై పడినట్లేనని పవన్ స్పష్టం చేశారు. అందుకే, తిరుపతి వెళుతున్నానని అక్కడే తేల్చుకుంటానని అన్నారు. జనసేనలో ఏ కార్యకర్త పై, నేతపై దాడి జరిగినా అది తనపై జరిగినట్లే భావిస్తానని, తాను అండగా వచ్చి నిలబడతానని అన్నారు.
తన కార్యకర్తలకు ఏమైనా జరిగితే…. జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. అంజూ యాదవ్ వ్యవహారంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేసి వినతిపత్రం సమర్పించనున్నారు. అంతకుముందు, పవన్ పై జగన్ వ్యాఖ్యలను నిరసిస్తూ శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తలు ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు వారు ప్రయత్నించగా, సీఐ అంజూ యాదవ్ ఆధ్వర్యంలోని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగానే జనసేన నాయకుడు సాయిపై సీఐ అంజూ యాదవ్ చేయి చేసుకున్నారు.