జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మరోసారివైసీపీ అధినేత, సీఎం జగన్‌పై నేరుగానే విరుచుకుపడ్డారు. వారాహి 2.0 విజయ యాత్ర ను కొనసాగిస్తున్నపవన్.. తాజాగా శుక్రవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో నిర్వహించిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన జగన్‌పై విమర్శలు గుప్పించారు. ప్రజల సొమ్మును దోచేస్తున్నారని వ్యాఖ్యానించారు. తుఫానులు, వరదలు.. ఉత్పాతాల వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు.. ప్రజలను ఆదుకునేందుకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా సొంత ఖర్చులకు వాడేస్తున్నారని దుయ్యబట్టారు.
నవరత్నాలు పేరుతో అన్ని విధాలా ప్రజలను మోసం చేస్తున్నారని పవన్ విమర్శలు గుప్పించారు. అదేసమయంలో జగన్‌పై మరిన్ని వ్యాఖ్యలు చేశారు. “జగన్‌ను.. నువ్వు అంటే.. తప్పా!” అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు తాను జగన్ అనే పిలిచానని.. ఇప్పటి నుంచి జగ్గు భాయ్ అని పిలుస్తానని పవన్ అన్నారు. అంతేకాదు.. వైసీపీ నేతలు నోరు జారితే.. జగ్గు భాయ్ కూడా కాదు.. ఇంకేదొస్తే.. అలానే పిలుస్తానని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు.. ఉద్యోగులను నమ్మించి ఓట్లు వేయించుకున్నాడని.. అధికారంలోకి వచ్చాక అందరినీ మోసం చేశారని అన్నారు.
సీపీఎస్ పై ఎన్నికలకు ముందు ప్రసంగాలు దంచి కొట్టిన జగన్.. అధికారంలోకి వచ్చాక.. దానిపై అవగాహన లేదని వ్యాఖ్యానించడాన్ని పవన్ తీవ్రస్థాయిలో తప్పు బట్టారు. ఇది మోసం కాదా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల పీఎఫ్ సొమ్మును, వారి ఇతర సొమ్ములను కూడా జగన్ దోచేస్తున్నాడని అన్నారు. “అందుకే.. చెబుతున్నా.. జగన్‌కు పచ్చ చొక్కా.. గళ్ల లుంగీ అయితే.. బాగుంటుంది. ఇదే గతి అవుతుంది” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను వ్యక్తిగతంగా వైసీపీ నాయకులు ఏమైనా అనొచ్చా.. తాను మాత్రం ఏమీ అనకూడదా? అని పవన్ ప్రశ్నించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates