వైసీపీ అధినేత, సీఎం జగన్ అనూహ్యంగా ఐప్యాక్ బృందంతో భేటీ అయ్యారు. సాధారణంగా ఆయన నెలకు ఒక్కసారి మాత్రమే ఇలాంటి భేటీ నిర్వహిస్తున్నారు. ఈ నెలలో 1వ తారీకు ఒకసారి ఐప్యాక్ బృందంతో భేటీ అయ్యారు. అయితే.. ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత..కేవలం రెండురోజుల వ్యవధిలోనే మరోసారి ఆయన ఐప్యాక్ బృందంతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు సుదీర్ఘంగా 5 గంటల పాటు ఆయన చర్చించారు.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఐప్యాక్ భేటీలో వైసీపీ ముఖ్యనేతలు, ఐప్యాక్ టీమ్ ఇన్‌ఛార్జి రిషిరాజ్, సహ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలపై చర్చించారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ తాజా పరిస్థితిపై సీఎం విశ్లేషించారు. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతున్న తీరుపై సీఎం సమీక్షించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల భాగస్వామ్యం, పనితీరుపై చర్చించారు.
ఎమ్మెల్యేల పనితీరుపై ఐప్యాక్ టీం ఇచ్చిన నివేదికలపై సీఎం చర్చించినట్లు తెలిసింది. నియోజకవర్గాల్లో గ్రాఫ్ తగ్గిన ఎమ్మెల్యే లపై నా సీఎం చర్చించారు. పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేధాలు నెలకొన్న పరిస్ధితుల్లో నియోజకవర్గ ఇన్‌ఛార్జిల మార్పు, నియామకాలపై సమాలోచనలు జరిపినట్టు తెలిసింది. అదేసమయంలో ముందస్తుకు వెళ్లే అవకాశంపై వారితో చర్చించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల కాలంలో ముందస్తు ఎన్నికల వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో ఐప్యాక్ సభ్యులతో భేటీప్రాధాన్యం సంతరించుకుంది.