ఏపీలో టీడీపీ తర్వాత మరో ప్రతిపక్షంగా ఉన్న పార్టీ జనసేన. గత ఎన్నికల్లో 146 స్థానాల్లో పోటీ చేసిన జనసేన మిగిలిన స్థానాలను మిత్రపక్షాలైన కమ్యూనిస్టులు, బీఎస్పీకి కేటాయించింది. ఈ క్రమంలో రాజోలు నియోజకవర్గంలో విజయం దక్కించుకుంది. అయితే.. ఆయన వైసీపీ చెంతకు చేరిపోయారు. ఇదిలావుంటే.. ఓడిపోయినప్పటికీ.. ఓటు బ్యాంకు ను మాత్రం 7.8 శాతం వరకు జనసేన సాధించింది. ఇది ఒకింత పార్టీకి అనుకూలమనే చెప్పాలి.
బలమైన వైసీపీని ఎదుర్కొని మరీ 7 శాతం ఓటు బ్యాంకు సాధించడాన్ని పరిశీలకులు సైతం గొప్పగానే పేర్కొన్నారు. ఇక, ఈ నాలుగేళ్లలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నా రు. అదేవిధంగా కౌలు రైతులకు, ఇతర ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అండగా ఉంటున్నారు. అదేసమయంలో తన సొంత సామాజిక వర్గం కాపుల్లోనూ రాజకీయ చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించారు. ఫలితంగా ఆయన వేసిన అడుగులు ఫలితాన్నిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఎవరు అధికారంలోకి వస్తారు? ఎవరికి ఎన్ని సీట్లు, ఎన్ని ఓట్లు వస్తాయనే విషయంపై జరుగుతున్న అనేక సర్వేల్లో జనసేన ఓటు బ్యాంకు ప్రస్తావన కూడా ఎక్కువగానే ఉంది. ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాల్లోని ఓ వర్గం ప్రజలు జనసేనకు దన్నుగా మారుతున్నట్టు సర్వేలు చెబుతున్నారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రం వరకు రారని భావించే యువత కూడా ఈ సారి జనసేన కోసం పోలింగ్ బూతులకు వస్తామని చెబుతున్నారు.
దీంతో జనసేన ఓటు బ్యాంకు పెరుగుతోందని.. సర్వేలు అన్నీ చెబుతున్నారు. పార్టీలకు అతీతంగా ఉన్నవీ.. పార్టీలతో అనుసంధానం ఏర్పరుచుకుని సర్వే చేస్తున్న సంస్థలు కూడా జనసేన పార్టీకి గ్రాఫ్ పెరిగినట్టు చెబుతుండడం గమనార్హం. ఇది.. గత ఎన్నికలతో పోల్చుకుంటే 2 నుంచి 3 శాతం పెరిగిందని అంటున్నారు. అయితే.. ఎన్నికలు మరికొంత కాలం ఆగి జరిగితే.. ఈ లెక్క మరింతగా పెరిగే ఛాన్సే ఉందని.. తగ్గదని కూడా లెక్కలు వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates