మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న తరుణంతో పాటు ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం కూడా ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్ర, జాతీయ రాజకీయాలపై సీనియర్ పొలిటిషియన్ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు తర్వాత పవన్ పై తాను పెద్దగా ఫోకస్ చేయలేదని, పవన్ తో మాట్లాడలేదని అన్నారు. పవన్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో తెలియదని ఒక కన్ఫ్యూషన్ ను మాత్రం క్రియేట్ చేశారని ఉండవల్లి ఆరోపించారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ అవకతవకల వ్యవహారంలో తాను చేసిన ఆరోపణలన్నీ నిజాలని వారే ఒప్పుకున్నారని ఉండవల్లి వ్యాఖ్యానించారు
నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహరించిందని, వైసీపీ తప్ప ఏపీలోని అన్ని పార్టీలు రామోజీరావుకు మద్దతుగా నిలిచాయని ఆరోపించారు. ఈ రోజు జగన్ సీఎంగా ఉన్న సమయంలో మార్గదర్శి విషయంలో వాస్తవం ఏమిటి అన్నది ప్రజలకు తెలిసిందన్నారు. ఇక, పోలవరం డయాఫ్రమ్ వాల్ డామేజ్ బాధ్యులను ప్రభుత్వం గుర్తించాలని ఉండవల్లి కోరారు. పోలవరం ప్రస్తుత పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భిన్నత్వంలో ఏకత్వం, అనేక కులమతాలు కలగలిపిన మన దేశంలో ఉమ్మడి పౌర స్మృతి సాధ్యం కాదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.
కేంద్రం చేసిన అప్పులు లక్షల కోట్లలో ఉన్నాయని, కానీ కేంద్రాన్ని విమర్శించే, ప్రశ్నించే పరిస్థితి, ధైర్యం ఏ పార్టీకి లేవని ఉండవల్లి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కు ఉన్న అష్ట దరిద్రాలకు ఏకైక కారణం కేంద్రమే అని ఉండవల్లి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర విభజన షోరూంను పంచుకోవడం వంటిదని, షోరూం తెలంగాణకు…వెనుక గోడౌన్ మనకు వచ్చిందని చెప్పారు. సిద్ధాంతపరమైన కాలుష్యం దేశాన్ని చుట్టేసిందని, అందులో నుంచి బయటపడితే కానీ దేశాభివృద్ధి సాధ్యం కాదని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.