గత 2019 ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని భుజాలపైకి ఎత్తుకున్న కీలక నాయకుడు.. తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడంతోపాటు.. ఆయన విజయానికి కీలక పాత్ర పోషించిన యువ నాయకుడు.. తాజాగా టీడీపీకి జైకొట్టారు. ఆయనే ఉమ్మడి కృష్నాజిల్లాలోని అవనిగడ్డకు చెందిన పరుచూరి సుభాష్ చంద్రబోస్. కమ్మ సామాజిక వర్గానికి చెందిన బోస్.. 2019 ఎన్నికల్లో ఇక్కడ అన్నీ తానై వ్యవహరించారు.
ఫలితంగా కమ్మ ఓటు బ్యాంకు.. వైసీపీకి అనుకూలంగా పడేలా చేశారనే వాదన ఉంది. ప్రజల్లోనూ బలమైన గుర్తింపు ఉన్న సుభాష్‌కు ఇటీవల కాలంలో వైసీపీలో అవమానాలు ఎక్కువయ్యాయి. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో అవనిగడ్డ టికెట్‌ను ఆయన ఆశించారు. అయితే.. దీనిని ఇస్తామని చెప్పిన వైసీపీ అధిష్టానం .. ఇటీవల కాలంలో కనీసం ఆయనను పట్టించుకోలేదు. దీంతో పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన తాజాగా మాజీ ఎమ్మెల్యే, ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో పనిచేసేందుకు అంగీకరించారు.
ఈ క్రమంలో పరుచూరి సుభాష్ చంద్రబోస్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 100 కార్లలో అవనిగడ్డ నుంచి ఉండవల్లికి వచ్చిన ఆయన.. మండలి బుద్ధ ప్రసాద్ నేతృత్వంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా పరుచూరి మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం సాధ్యమని భావించి తెలుగుదేశంలో చేరినట్టు తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates