వైసీపీని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకువస్తే.. చాలు.. తదుపరి వచ్చే 30 ఏళ్లపాటు అధికారంలో ఉండే అవకాశం ఉందని వైసీపీ అధినేత, సీఎం జగన్ పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన భారీ లక్షం ‘వైనాట్ 175’ ను నిర్ణయించుకున్నారు. అదేసమయంలో అధికారులు.. ప్రజాప్రతినిధులను కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ.. ప్రజల మధ్య ఉండేలా కార్యాచరణ సిద్ధం చేసుకుని ముందుకు నడిపిస్తున్నారు.
ఇక, అనేక కార్యక్రమాలను కూడా సీఎం జగన్ అమలు చేస్తున్నారు. క్యాలెండర్ పెట్టుకుని.. మరీ సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులు విడుదల చేస్తున్నారు. అప్పులపై అప్పులు కూడా చేస్తున్నారు. ఇదంతా.. దేనికోసం అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వచ్చే ఎన్నికల్లో విజయం కోసమే. అయితే.. ఇంత వరకుబాగానే ఉన్నా.. ప్రధానంగా వైసీపీకి రెండు చిక్కులు ఎదురవుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఒకటి.. ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర స్థాయిలో ఎదురవుతున్న ఎదురుదాడి. విమర్శలు.. ఇతరత్రా కార్యక్రమాలు.. వైసీపీని డిఫెన్స్‌లో పడేస్తున్నాయి. సరే.. దీనిని రాజకీయ వ్యూహాలతో ఎదుర్కొనేందుకు వైసీపీ అధిష్టానం కూడా కసరత్తు ముమ్మరం చేసింది. అయితే.. ఇప్పుడు రెండో సమస్యే అసలు వైసీపీని తీవ్ర ఇరకాటంలోకి నెట్టేస్తోంది. అదే.. సొంత పార్టీ నాయకుల మధ్య ఐక్యత లేకపోవడం.. ఎవరికి వారు.. పార్టీలో విభేదాలకు దిగుతుండడం.. అధినేతను కలవరపరుస్తున్నాయి.
నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు, విజయనగరం నుంచి చిత్తూరు వరకు.. ప్రతి జిల్లాలోనూ నాయకుల మధ్య సఖ్యత లేకపోవడంతోపాటు.. ఏకంగా సదరు ప్రజాప్రతినిధులపై అధిష్టానానికే ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతోంది. అంతేకాదు.. కీలక నేతలైన బాలినేని, రోజా, కోలగట్ల, పేర్నినాని.. వంటివారిని ఓడిస్తామంటూ.. సొంత పార్టీ నాయకులే బహిరంగ విమర్శలు చేస్తుండడంతో ఇప్పుడు పరిస్థితిని ఎలా సరిదిద్దాలనేది పార్టీ అధినేతకు తలనొప్పిగా మారిందని అంటున్నారు పరిశీలకులు.