ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో జగన్మోహన్ రెడ్డికి కాపు భవన్లు నిర్మించాలన్న విషయం ఇపుడు గుర్తుకొచ్చినట్లుంది. అదికూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహియాత్ర నేపధ్యంలో కాపులపై రచ్చ జరిగిన తర్వాత. ఇంతకీ విషయం ఏమిటంటే కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు మాట్లాడుతు ముడు ప్రాంతాల్లో కాపు భవన్లు నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు విడుదలచేసినట్లు చెప్పారు. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం, కర్నూలులో కాపు భవన్ల నిర్మాణానికి నిధులు మంజూరుచేసిన విషయాన్ని శేషు వివరించారు.
విజయవాడ కాపు భవన్ కు కోటిరూపాయలు, విశాఖ, కర్నూలు జిల్లాల కేంద్రాల్లో భవనాల ఏర్పాటుకు చెరో రు. 50 లక్షలు విడుదలైనట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కాపుల సంక్షేమానికి జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల కేంద్రాలవారీగా కమిటీల ఏర్పాటుకు కాపు కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కాపు నేస్తం పథకంలో భాగంగా ఇప్పటివరకు ప్రభుత్వం రు. 1500 కోట్ల విడుదలచేసినట్లు చెప్పారు. జగనన్న విద్యాపథకంలో భాగంగా 42 మంది కాపు విద్యార్ధులు విదేశాలకు వెళ్ళి చదువుకునేందుకు సాయం అందిందన్నారు.
ఇక తునిలో జరిగిన రైలు దహనం కేసులో కాపులపై నమోదైన 42 కేసులను తమ ప్రభుత్వం ఎత్తేసిన విషయాన్ని గుర్తుచేశారు. టీడీపీ హయాంలో కాపు కార్పొరేషన్ నిధుల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరుపుతున్న కమిటి నివేదికను మరో 15 రోజుల్లో ఇస్తుందన్నారు. నవరత్నాలతో సంబంధంలేకుండానే కాపునేస్తం ద్వారా మూడేళ్ళలో తమ ప్రభుత్వం రు. 1500 కోట్లు విడుదలచేసిందన్నారు.
అంతాబాగానే ఉంది మరి కాపు భవన్ల నిర్మాణానికి నిధులు విడుదలకు ఇంతకాలం ఎందుకు పట్టిందన్నది కీలకమైన పాయింట్. కాపుభవన్ల నిర్మాణానికి నిధులు విడుదలయ్యాయని గొప్పగా చెబుతున్న శేష ఇంతకాలం విడుదలకాని నిధులు ఇపుడే ఎందుకు విడుదలైనట్లో సమాధానం చెప్పగలరా ? ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే అని అర్ధమైపోతోంది. అదికూడా వారాహియాత్ర సందర్భంగా కాపులకు ఎవరేమి చేశారనే చర్చలు మొదలయ్యాయి కాబట్టే అన్నది ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. జరుగుతున్నది ఏమిటి ? కాపులకు ఏ ప్రభుత్వంలో మంచి జరిగిందన్నది కాపు సామాజికవర్గంకు ప్రత్యేకంగా ఎవరో చెప్పాల్సిన పనిలేదు. మరి రాబోయే ఎన్నికల్లో ఏమిచేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates