గాంధీభవన్లో జీవకళ కనబడుతోందా ?

వచ్చే ఎన్నికల ఫలితాలు ఎలాగుంటాయో తెలీదు కానీ ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చేరికలతో కళకళలాడుతోంది. చాలాకాలం తర్వాత గాంధీభవన్ లో జీవకళ ఉట్టిపడుతోంది. రెండు వరుస ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీకి ఇపుడు జవసత్వాలు సమకూరటం అంటే చిన్న విషయం కాదు. ఇదంతా ఎలా సాధ్యమైందంటే కర్ణాటకలో పార్టీ గెలుపుతోనే. ఎప్పుడైతే కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందో అప్పటినుండి తెలంగాణా కాంగ్రెస్ నేతల్లో జోష్ పెరిగిపోయింది.

కర్ణాటక ఘన విజయాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని పార్టీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. బీఆర్ఎస్, బీజేపీల నుండి నేతలను ఆకర్షించటమే కాకుండా కాంగ్రెస్ నుండి వెళ్ళిపోయిన నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘర్ వాపసీ పిలుపిచ్చారు. ఆ పిలుపు ప్రభావం కూడా నేతల్లో బాగానే పనిచేస్తోంది. తాజాగా ఢిల్లీలో రాహుల్ గాంధి సమక్షంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరటంతో పార్టీకి ఊపొచ్చినట్లయ్యింది.

జూపల్లిని పక్కన పెట్టేస్తే పొంగులేటి కాంగ్రెస్ లో చేరటం మాత్రం పార్టీకి బాగా బూస్టప్ ఇచ్చేదే అనటంలో సందేహంలేదు. ఎందుకంటే ఆర్ధిక, అంగబలాలు పొంగులేటికి అపరాంగా ఉంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బలమైన మద్దతుదారులు, అనుచరులున్న పొంగులేటి కాంగ్రెస్ లో చేరికవల్ల పార్టీకి మంచి ఊపొస్తుందని చెప్పటంలో తప్పులేదు.  అవసరమైతే ఇతర జిల్లాల్లోని అభ్యర్ధులకు కూడా నిధులను సర్దుబాటు చేయగల ఆర్ధిక పరిపుష్టి ఉన్న నేత. పొంగులేటి గురించి తెలుసుకాబట్టే తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ నేతలు విశ్వప్రయత్నాలు చేశారు.

అయితే బీజేపీలో చేరటం వల్ల లాభం కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయని బీఆర్ఎస్ ను ఓడించాలనే టార్గెట్ కాంగ్రెస్ లో చేరితే సాధ్యమవుతుందని నమ్మటంతోనే పొంగులేటి హస్తాన్ని అందుకున్నారు. జరుగుతున్న ప్రచారం నిజమే అయితే తొందరలోనే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఈటల, విజయశాంతి, కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి ప్రముఖ నేతలు కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారు. మరి ఇంతమంది పెద్ద నేతలు చేరిపోతే వీళ్ళకి ఎంపీ, ఎంఎల్ఏ టికెట్లు సర్దబాటు చేయగలదా ? ఇంతమందిని  కాంగ్రెస్ తట్టుకోగలదా ?