కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరి రామజోగయ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఒక లేఖ రాశారు. అందులో రాబోయే ఎన్నికల్లో పవన్ పోటీ చేస్తే బాగుంటుందని తాను అనుకుంటున్న మూడు నియోజకవర్గాలను జోగయ్య సూచించారు. ఇంతకీ ఆ మూడు నియోజకవర్గాలు ఏవంటే భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం. ఈ మూడింటిలో ఎక్కడి నుంచి పోటీ చేసినా పవన్ గెలుపు గ్యారెంటీనట. ఎందుకంటే పవన్ ఎప్పుడెప్పుడు పోటీ చేద్దామా గెలిపించుకుందామా అని జనాలు ఎదురుచూస్తున్నట్లు జోగయ్య చెప్పారు.
సరే గెలుపోటములు దైవాధీనాలని అందరికీ తెలిసిందే. మానవ ప్రయత్నం ఏమిటంటే గెలుపుకు కష్టపడటం మాత్రమే. ఫలితం భగవంతుడి చేతిలోనే ఉంటుంది. జోగయ్య లేఖలో పోయిన ఎన్నికల్లో పవన్ పోటీచేసి పవన్ ఓడిపోయిన భీమవరం కూడా ఉంది. ఇక్కడ విషయం ఏమిటంటే ఈ మూడు నియోజకవర్గాల్లోను ప్రస్తుతం వైసీపీ ఎంఎల్ఏలే ఉన్నారు. తాడేపల్లిగూడెం, భీమవరం నుండి కొట్టు సత్యనారాయణ, గ్రంధి శ్రీనివాస్ గెలిస్తే నరసాపురం నుండి మదునూరు ప్రసాదరాజు నెగ్గారు.
పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాలివే అని ఇప్పటికే చాలా ప్రచారంలో ఉన్నాయి. తిరుపతి, నెల్లూరు, భీమిలీ, విశాఖపట్నం నార్త్, పిఠాపురం, కాకినాడ రూరల్, నరసాపురం అని చాలా కాలంగా ప్రచారంలో ఉన్నాయి. అయితే పవన్ ఎక్కడినుండి పోటీ చేసినా కాపులు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలనే చూసుకుంటారన్నది గ్యారెంటి. ఇన్ని నియోజకవర్గాలు ప్రచారంలో ఉండగా సడెన్ గా జోగయ్య మాత్రం పై మూడు నియోజకవర్గాలనే ఎందుకు సూచించినట్లు ?
ఎందుకంటే పై మూడింటిలో కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా ఉభయగోదావరి జిల్లాల్లో జోగయ్య చేయించిన సర్వేల్లో జనసేనకు బాగా ఆధరణ ఉంటుందని తేలిన నియోజకవర్గాల్లో ఈ మూడు ఉన్నాయట. ఇంతేకాకుండా అధికారపార్టీ ఎంఎల్ఏల మీద జనాల్లో ఎంతోకొంత వ్యతిరేకత ఉండటం సహజమే కదా. కాబట్టి కాపుల ఓట్లు+సిట్టింగుల మీద వ్యతిరేకత+అభిమానులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జోగయ్య మూడు నియోజకవర్గాలను సూచించారు. మరి పవన్ ఈ విషయాన్ని ఆలోచిస్తారా ? లేకపోతే ఏదో పెద్దాయనలే ఏవో చెబుతుంటారని తీసిపారేస్తారా ? అన్నది చూడాల్సిందే.