కొన్ని రోజుల కిందట తనకు ప్రాణహాని ఉందంటూ.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 2019లో కనుక వైసీపీ అధికారంలోకి రాకపోయి ఉంటే.. తనను చంపేసేవారని ఆయన తూర్పుగోదావరి జిల్లా వారాహి యాత్రలో వ్యాఖ్యానించి సంచలనం రేపారు. ఇక, ఇప్పుడు తాజాగా.. తనను చంపించేందుకు కొందరు వైసీపీ ముఠా నాయకులు.. సుపారీ గ్యాంగులను పంపిస్తున్నారని చెప్పారు. తాజాగా ఆయన మలికిపురంలో యాత్రనురద్దు చేసుకున్న నేపథ్యంలో స్థానిక పార్టీ నేతలతో అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ..తనను చంపేందుకు సుపారీ గ్యాంగులు తిరుగుతున్నాయని చెప్పారు.
అయినా.. తాను ఏమాత్రం భయపడేది లేదని పవన్ చెప్పారు. సుపారీ గ్యాంగులకు.. ఆకు రౌడీలకు పవన్ భయపడడని చెప్పారు. అదే సమయంలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రెడ్డి పాలన నుంచి ఉభయ గోదావరి జిల్లాలకు విముక్తి కల్పించడమే జనసేన పార్టీ ముఖ్యమ లక్ష్యమని ప్రకటించారు. ‘ఉభయగోదావరి జిల్లాలను జనసేన పార్టీ ప్రత్యేకంగా తీసుకుంది. ఎందుకంటే.. వైసీపీ పాలన నుంచి ఈ జిల్లాలను ముందుగా విముక్తి చేయాలి” అని అన్నారు.
వైసీపీ అంటే కోపం లేదు!
తనకు వైసీపీ అన్నా.. ముఖ్యమంత్రి జగన్ అన్నా కోపం లేదని పవన్ వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే.. తన కోపం అంతా కూడా వైసీపీ దుర్మార్గపు పాలన పైనేనని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కనీసం రోడ్లు కూడా వేయని పరిస్థితి కనిపిస్తోందన్నారు. రాజోలు నుంచి కారులో వస్తుంటే అదొక పడవ ప్రయాణంలా తనకు అనిపించిందన్నారు. అందుకే వైసీపీ పాలన నుంచి ఉభయ గోదావరి జిల్లాలకు విముక్తి కల్పించడమే తన పార్టీ మొదటి లక్ష్యంగా నిర్ణయించిందని పవన్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెడతామననారు. అందరికీ అన్నం పెట్టే గోదారి నేలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.
అప్పటి వరకు ఎమ్మెల్యే కూడా కాలేవ్: మంత్రి సీదిరి
జనసేనాని పవన్‌పై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైరయ్యారు. సీఎం అని చెప్పే ముందు పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. జనసేన పార్టీ ఏన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తోందో కూడా తెలియడం లేదని ఎద్దేవా చేశారు. అలాంటప్పుడు పవన్ ముఖ్యమంత్రి ఎలా అవుతారని ప్రశ్నించారు. కార్యకర్తలను ఉత్తేజ పరిచేందుకే.. పవన్ ముఖ్యమంత్రి జపం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ రహితం ఎందుకు చెయ్యాలో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు వంతపాడినంత కాలం పవన్ ఎమ్మెల్యే కూడా కాలేరని వ్యాఖ్యానించారు.