పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న జనాకర్షణ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆకర్షణను రాజకీయంగా సరిగా ఉపయోగించుకోలేదనే విమర్శ ఆయనపై ఉంది. జనసేన పెట్టి పదేళ్లు కావస్తున్నా.. పార్టీ నిర్మాణం సరిగా జరగకపోవడం, పవన్ అనుకున్న స్థాయిలో జనాల్లో తిరగపోవడం పట్ల విమర్శలు అన్నీ ఇన్నీ కావు.
పార్ట్ టైం పొలిటీషియన్ అనే విమర్శలకు పవన్ దీటుగా సమాధానం చెప్పలేకపోయాడనే అభిప్రాయం జనాల్లో కూడా బలంగా ఉంది. ఐతే పవన్ అప్పుడప్పుడూ రంగంలోకి దిగినా సరే.. ఏపీలోని మిగతా ప్రధాన పార్టీలకు టెన్షన్ తప్పదు. ముఖ్యంగా అధికార వైసీపీ.. పవన్ ఏదైనా కార్యక్రమం పెట్టాడంటే చాలు.. షేక్ అయిపోతుంటుంది.
ఆ పార్టీ నేతలు పవన్‌ను టార్గెట్ చేసే తీరు.. ప్రభుత్వం పెట్టే ఇబ్బందులు చూస్తేనే వాళ్ల అభద్రతా భావం బయటపడిపోతుంటుంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పవన్ మొదలుపెట్టిన వారాహి యాత్రతో అయితే వైసీపీకి కంటి మీద కునుకు ఉండట్లేదన్నది వాస్తవం.
వాయిదాల మీద వాయిదాలు పడి ఎట్టకేలకు వారం కిందట మొదలైన వారాహి యాత్రకు జనాల నుంచి మామూలు స్పందన రావట్లేదు. గోదావరి ప్రాంతంలో పవన్‌కు జనం బ్రహ్మరథం పడుతున్నారు. పవన్ వెళ్లిన చోటల్లా మహిళలు జేసీబీలు, వాహనాల మీదికి ఎక్కి ఆయనకు హారతులు పడుతున్న వైనం.. పవన్ రోడ్ షోలకు ఇసుకేస్తే రాలనంతగా తరలి వస్తున్న జనం.. ఈ దృశ్యాలు చూసి వైసీపీ టెన్షన్ పడుతూ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
వైసీపీ నేతలు రోజూ ఆయన్ని టార్గెట్ చేస్తున్న తీరే.. ఈ యాత్ర విషయంలో వాళ్లెంత మథనపడుతున్నారనడానికి నిదర్శనం. ప్రస్తుతానికి అనధికార మిత్ర పక్షమే అయినప్పటికీ.. పవన్ యాత్ర ఒక రకంగా టీడీపీకి సైతం ఇబ్బందికరంగా మారింది. పవన్ రంగంలోకి దిగినప్పటి నుంచి నారా లోకేష్ యువగళం యాత్ర సైడ్ లైన్ అయిపోయింది. మీడియా, సోషల్ మీడియాను మొత్తం పవనే ఆక్రమించేశాడు. చంద్రబాబు కూడా పర్యటనలు చేస్తున్నా అంతగా హైలైట్ కావట్లేదు. దీన్ని బట్టే పవన్ గ్రౌండ్లో అడుగు పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates