ఏపీలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ బరికి వైసీపీ అభ్యర్థిని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. ఈ నెల 24న జరగనున్న ఈ ఎన్నికలో వైసీపీ తరఫున ఆ పార్టీ సీనియర్ నేత, సోమవారం కన్నుమూసిన పెన్మత్స సాంబశివరాజు తనయుడు పెన్మత్స సురేశ్ బాబు బరిలోకి దిగనున్నారు.
ఈ మేరకు మంగళవారం జగన్.. పెన్మత్స అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన పెన్మత్స సాంబశివరాజు ఏకంగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన పెన్మత్స… జగన్ వైసీపీని ప్రారంభించాక జగన్ తోనే కలిసి సాగారు.
అయితే వివిధ సమీకరణాల రిత్యా మొన్నటి ఎన్నికల్లో పెన్మత్సకు జగన్ టికెట్ కేటాయించలేకపోయారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా కీలక పదవిలో పెన్మత్సను జగన్ నియమిస్తారని అంతా అనుకున్నారు. అయితే ఆ దిశగా జగన్ నిర్ణయం తీసుకునేలోగానే పెన్మత్స సోమవారం కన్నుమూశారు.
ఈ క్రమంలో పెన్మత్స మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్… తన వెంట నడిచిన సీనియర్ పొలిటీషియన్ ఫ్యామిలీకి ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతోనే పెన్మత్స తనయుడు సురేశ్ బాబును తాజాగా పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశారు.
మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలైన సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణను ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
అయితే మండలిని రద్దు చేసే దిశగా అడుగులు వేసిన జగన్… మోపిదేవితో పాటు పిల్లి సుభాష్ చంద్రబోస్ ను రాజ్యసభకు పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోపిదేవి ఖాళీ చేసిన ఎమ్మెల్సీ సీటుకు ఎన్నిక అనివార్యమైంది. ఈ సీటును పెన్మత్స కుమారుడు సురేశ్ బాబుకు జగన్ ఖారారు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates