జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నాలుగు రోజులు సాగింది. ఈ నాలుగు రోజుల యాత్రపై ఇక్కడి ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారనేది ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికలకు సంబంధించిజనసేనకు ఈ జిల్లాలు అత్యంత కీలకంగా మారాయి. దీంతో వారాహి యాత్రను కూడా ఈ జిల్లాల నుంచే పవన్ ప్రారంభించారు. వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
ముఖ్యంగా కాకినాడ సిటీ, రూరల్ ఎమ్మెల్యేలపై పవన్ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. అదే సమయంలో తాను వస్తే ఏం చేస్తాననేది కూడా వివరించారు. ఇక, పిఠాపురంతో దాదాపు ఉమ్మడి తూర్పుగోదావరిలో మెజారిటీ పార్ట్ ను ఈ యాత్ర పూర్తి చేసుకున్నట్టు అయింది. దీంతో ఇక్కడి ప్రజలు ఏమనుకుంటున్నార నేది ఇంట్రస్టింగ్‌గానే కాకుండా.. ఇంపార్టెంట్‌గా కూడా మారింది. ఈ విషయాన్ని పరిశీలిస్తే.. మెజారిటీ గోదావరి ప్రజలు పవన్‌ను ఆదరించేందుకు రెడీగానే ఉన్నారు.
ఆయన చెప్పిన విషయాలపై కూడా వారు దృష్టి పెట్టారు. అవినీతి రహితం, కాపులు సమైక్యం కావడం.. ఐక్యంగా సమస్యలపై పోరాటం చేయడం వంటివి బాగానే ఎక్కాయి అయితే.. ఇక్కడ ప్రధానంగా రెండు ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఒకటి అభ్యర్థుల ఎంపిక. ఉభయ గోదావరి జిల్లాల్లో అభ్యర్థులను బట్టి.. ప్రజలు ఓటే స్తారు. పార్టీ జెండాలు అజెండాలు ఎలా ఉన్నా.. అభ్యర్థులు బలమైన వారు అయితే.. వారిని గెలిపించే లక్షణం.. ఉంటుంది.
దీంతో జనసేన అభ్యర్థుల కోసం.. ఇక్కడచాలా మంది చర్చించుకున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు.. ఇప్పటికీ ఐపు లేకుండా పోయారు. ఒకరిద్దరు తప్ప.. ఎక్కడా మిగిలినవారు కనిపించ డం లేదు. దీంతో అభ్యర్థులను ప్రకటించాలనేది ప్రధాన ప్రశ్న. రెండు అందరూ అనుకుంటున్నట్టుగానే సీఎం అభ్యర్థి ఎవరు? అనేది గోదావరిలో విస్తృతంగా వినిపిస్తున్న టాక్. దీనిపై క్లారిటీ ఇవ్వాలనేది యువత ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు మినహా.. జనసేన టాక్ గోదావరి జిల్లాల్లో బాగానే ఉందని తెలుస్తోంది.