ఒకప్పుడు రాజు గారు వస్తున్నారు.. జనాలు జాగ్రత్తగా ఉండండి.. ముందు ఊళ్లలో టముకు వేసి మరీ చెప్పి నట్టుగా.. వైసీపీ పాలనలోనూ.. ఏపీలో ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. పైకి జాగ్రత్త అనే మాట బదులు నవ్వుతూ ఉండాలి అనే పదం చేర్చినా.. అంతర్గతంగా మాత్రం.. ప్రజలు ఎవరూ.. ఎమ్మెల్యేను ప్రశ్నించవద్దు.. వారి సమస్యలు ఏకరువు పెట్టొద్దు.. అంతేకాదు. ఎవరూ.. ఎమ్మెల్యేను ఎవరూ నిలదీయడానికి వీల్లేదు.. అనే అర్థంలో వైసీపీ ఎమ్మెల్యే ఒకరు.. తన అనుచరులతో ముందుగానే వాట్సాప్ టముకు వేయించారు.
ఆసక్తికరంగా ఉన్న ఈ విషయం.. ఇప్పుడు వైసీపీలో చర్చకు దారితీసింది. ప్రస్తుతం సీఎం జగన్ ఆదేశాల మేరకు.. వైసీపీ ఎమ్మెల్యేలు గడపగడపకు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంతోపాటు కొందరు సొంత కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నారు. అయితే.. ఎవరు ప్రజలు దగ్గరకు వెళ్లినా.. ఏవో ఒక సమస్యలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రజలకు వారు సమాధానం చెప్పలేక వెనుదిరుగుతున్నా రు. బహుశ ఈ విషయాన్ని ముందుగానే గ్రహించిన అమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డివెంకటరామిరెడ్డి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నారు. ఉదయం 6 గంటలకే ఆయన వీధుల్లోకి వచ్చి జనాలను పలకరిస్తున్నారు. అయితే.. ఎమ్మెల్యేకు తమ సమస్యలు చెప్పుకొనేందుకు ప్రజలు కూడా రెడీ అవుతున్నారు. దీంతో ఒకటి రెండు ఇళ్లు తిరిగే సరికి ఎమ్మెల్యే తల వేడెక్కిపోతోంది.దీంతో ఆయన తెలివిగా… కౌన్సిలర్లు, వాలంటీర్ల ద్వారా ప్రచారం చేయిస్తున్నారు.
అతిగా మాట్లాడే వారిని ఎమ్మెల్యే కేతిరెడ్డి దగ్గరకు రానీయొద్దని, ఎక్స్‌ట్రాలు చేసే వారిని పిలవద్దని సూచించారు. ఇంటి దగ్గరకు ఎమ్మెల్యే వచ్చినప్పుడు జనాలు బిక్క మొహాలు వేసుకోకుండా నవ్వుతూ పలకరించాలని వాలంటీర్లకు హుకుం జారీ చేశారు. వార్డులోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యే కేతిరెడ్డికి బొకేలు, పూల హారాలు, స్వీట్ బాక్స్ లతో స్వాగతం పలకాలని ఆదేశాలు జారీచేశారు. మొత్తానికి కేతిరెడ్డి వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates