ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా సరే వైసీపీని ఓడించి టీడీపీని అధికారంలోకి తీసుకురావాల్సిందేనని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే యువగళం పేరుతో ఓ వైపు యువనేత నారా లోకేష్.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కష్టపడుతున్నారు. అయితే టీడీపీలోని కొందరు మాత్రం అసలు నియోజకవర్గంలో పట్టనట్లుగా.. పార్టీ కార్యక్రమాల్లో కూడా అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఈ విషయాలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తాజాగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
‘రానున్న ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో గెలిచేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. పార్టీలో పనిచేయలేని వారుంటే ఇప్పుడే తప్పుకోవాలి. పనిచేయకుంటే కచ్చితంగా సీరియస్ యాక్షన్ ఉంటుంది. పార్టీ కార్యక్రమాల విషయంలో అలక్ష్యం వద్దు. తప్పు కునే వాళ్లు ఇప్పుడే తప్పుకుంటే వారిస్థానంలో వేరేవాళ్లను ప్లాన్ చేస్తాం. నేనేమీ గట్టిగా మాట్లాడటం లేదు.. పనిచేయకుంటే యాక్షన్ మాత్రమే తీసుకుంటానని చెబుతున్నాను’ అని తెలుగు తమ్ముళ్లను చంద్రబాబు ఒకింత గట్టిగానే హెచ్చరించారు. నిజానికి ఇప్పటి వరకు ఆయన చూసీ చూడనట్టు వ్యవహరించినా.. ఇప్పుడు మాత్రం గట్టిగానే వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది.
నా అనుభవమంత వయసు లేదు!
“నేను ముసలివాడినా..? జగన్‌కు నాకున్న అనుభవమంత వయస్సు లేదు. సాయంత్రమైతే చాలు జగన్ పబ్జీ ఆడుకుంటారు” అని చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. జగన్ కానీ.. వైసీపీ నేతలు గానీ ఏం మాట్లాడినా సరే టీడీపీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్లు ఇవ్వాలని ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. మరోవైపు పాదయాత్రలో ప్రభుత్వ వైఫల్యాలను లోకేష్ ఎండగడుతూ.. టీడీపీ అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామనే దానిపై జనాలకు చెప్పుకుంటూ అడుగులు ముందుకేస్తున్నారని, ఆయనను చూసి అందరూ స్ఫూర్తిగా ముందుకు నడవాలని సూచించారు.
త్వరలోనే మరో మేనిఫెస్టో
త్వరలోనే మరో మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయడానికి టీడీపీ సన్నాహాలు చేస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. టీడీపీ మేనిఫెస్టో ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’ పై చైతన్య యాత్రను కూడా ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. ఇదిలావుంటే, చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్‌తో ఎంతమంది తెలుగు తమ్ముళ్లు దారిలోకొస్తారో చూడాలని సీనియర్లు వ్యాఖ్యానించారు. అదేసమయంలో ఎంతమంది పక్కకు తప్పుకుంటారో చూడాలని కూడా చెబుతున్నారు. రాష్ట్రంలో సుమారు 60 నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు ఉదాసీనంగా ఉన్నారని చంద్రబాబుకు తెలిపారు.