మళ్లీ వైసీపీలోకి చలమలశెట్టి.. ఈ సారైనా పని జరిగేనా?

చలమలశెట్టి సునీల్… విజయవంతమైన యువ పారిశ్రామికవేత్తగా తెలుగు ప్రజలకు సుపరిచితులే. వ్యాపారంలో రారాజుగా ఎదిగినా… రాజకీయాల్లో మాత్రం ఆయన సక్సెస్ కాలేకపోతున్నారు. ఎంపీ కావాలన్న తన చిరకాల వాంఛ 15 ఏళ్లకుపైగానే వాయిదా పడుతూనే వస్తోంది. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుడికి మల్లే చలమలశెట్టి మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. పార్టీ ఏదన్న విషయాన్ని పక్కనపెట్టేసిన చలమలశెట్టి… ఎంపీ కావాలన్న తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇప్పటికే చాలా అడుగులు వేశారు. కానీ ఎక్కడా ఆయన టార్గెట్ ను అందుకున్న దాఖలా కనిపించలేదు. అయితే ఎంపీ కావాలన్న తన కలను సాకారం చేసుకునేందుకు ఇప్పుడు ఏకంగా తన ప్లాన్ ను మార్చేసుకుని టార్గెట్ రీచ్ అయ్యేందుకు పకడ్బందీగానే ముందుకు కదులుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే మళ్లీ వైసీపీలోకి చేరిపోతున్నారు.

పారిశ్రామిక రంగంలో ఇప్పటికే సక్సెస్ ఫుల్ బిజినెస్ మన్ గా తనను తాను మలచుకున్న చలమలశెట్టి… ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టాలన్న బలమైన కోరికతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ప్రజారాజ్యం పెట్టగానే… తన కలను సాకారం చేసుకునేందుకు చలమలశెట్టి ప్రజారాజ్యంలో చేరిపోయారు. ప్రజారాజ్యం పార్టీ టికెట్ పై 2009లో కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగారు. అయితే నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంఎం పళ్లంరాజు చేతిలో పరాజయం పాలైన ఆయన.. 2014 వచ్చేసరికి కొత్తగా పార్టీగా ఎంట్రీ ఇచ్చిన వైసీపీలోకి జంప్ కొట్టేశారు. 2014లో వైసీపీ తరఫున బరిలోకి దిగిన చలమలశెట్టి… టీడీపీ అభ్యర్థి తోట నరసింహం చేతిలో ఓడిపోయారు. ఇక 2019 వచ్చేనాటికి టీడీపీలో చేరిన చలమలశెట్టి… వైసీపీ అభ్యర్థి వంగా గీత చేతిలో పరాజయం పాలయ్యారు. మొత్తంగా మూడు సార్లు మూడు పార్టీల తరఫున పోటీ చేసిన చలమలశెట్టి ఏ ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయారు.

ఈ నేపథ్యంలో ఇక ప్రత్యక్ష ఎన్నికలు తనకు సరిపోవని ఓ నిర్ధారణకు వచ్చిన చలమలశెట్టి… పరోక్ష ఎన్నిక ద్వారా అయినా పార్లమెంటులో అడుగుపెట్టాల్సిందేనన్న ఓ నిర్ణయానికి వచ్చేసినట్లుగానే కనిపిస్తోంది. ఇందులో బాగంగానే ఆయన తిరిగి వైసీపీ గూటికి చేరిపోతున్నారు. వైసీపీ తరఫున త్వరలో రాజ్యసభ సభ్వత్వాన్ని పొందేలా ప్లాన్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీలో చేరేందుకు చలమలశెట్టి సిద్ధం కాగా… అందుకు వైసీపీ అధిష్ఠానం కూడా ఓకే చెప్పేసిందట. అయితే ఈ చేరికకు చలమలశెట్టి ఎంచుకున్న రూట్ పై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తన కంపెనీ గ్రీన్ కో తరఫున సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.5 కోట్లను విరాళంగా ప్రకటించిన చలమలశెట్టి.. దానిని తన సోదరుడి చేత సీఎం జగన్ కు అందించి… తన మనసులోని మాటను బయటపెట్టినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా… తన టార్గెట్ ను చేరుకోవడమే లక్ష్యంగా కదులుతున్న చలమలశెట్టి.. ఈ సారైనా ఎంపీ సీటును దక్కించుకుంటారో, లేదో చూడాల్సిందే.

All the Streaming/OTT Updates you ever want. In One Place!