ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్

నందమూరి అభిమానులందు ఎన్టీఆర్ అభిమానులు వేరు. ఒకప్పుడు అంతా ఒక్కటే అన్నట్లుండేది కానీ.. తర్వాత పరిస్థితులు మారిపోయాయి. 2009లో ఎన్నికల్లో ఎన్టీఆర్ ఎంతో కష్టపడి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేస్తే ఆ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయని అతడి మీద ఒక నెగెటివ్ ముద్ర వేసి పక్కన పెట్టేశారు. ఇక అప్పట్నుంచి ఇటు బాలయ్యకు, అటు చంద్రబాబుకు ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నాడు. వాళ్లూ ఇతణ్ని పక్కన పెడుతున్నారు. రెండు వర్గాల మధ్య అంతరం అంతకంతకూ పెరిగి అగాథం నెలకొంది.

ఎన్టీఆర్‌ పట్ల బాబుకు ఎందుకంత చిన్నచూపు, అసూయ అని తారక్ అభిమానులే ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. నారా లోకేష్‌తో పోలిస్తే ఏ రకంగా చూసినా మెరుగ్గా కనిపించే తారక్‌ను ప్రోత్సహిస్తే తన కొడుకును పక్కన నెట్టి తెలుగుదేశం పార్టీని చేజిక్కించుకుంటాడేమో అన్న ఆందోళనతోనే చంద్రబాబు ఇలా ప్రవర్తిస్తుండొచ్చు.

తారక్ పట్ల చంద్రబాబు వివక్ష పలు సందర్భాల్లో బయటపడింది. సోషల్ మీడియాలో సైతం ఈ పక్షపాతాన్ని కొనసాగించారు చంద్రబాబు. ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండే చంద్రబాబు సినీ ప్రముఖుల పుట్టిన రోజులు వచ్చినపుడు శుభాకాంక్షలు చెబుతుంటారు. తన మాజీ రాజకీయ మిత్రుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు గత కొన్నేళ్లుగా ప్రతి ఏడాదీ బర్త్ డే విష్ చెబుతున్నారు చంద్రబాబు. అలాగే గత ఏడాది మెగాస్టార్ చిరంజీవికి కూడా శుభాకాంక్షలు చెప్పారు.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజున సైతం గుర్తుంచుకుని అతణ్ని పొగుడుతూ బర్త్ డే విషెస్ చెప్పారు. కానీ తారక్‌కు మాత్రం చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పట్లేదు. మే నెలలో తారక్‌ను పట్టించుకోకుండా ఇప్పుడు ఆగస్టులో మహేష్‌కు శుభాకాంక్షలు చెబితే ఎన్టీఆర్ అభిమానులు ఫీలవకుండా ఎలా ఉంటారు. చంద్రబాబును కూడా అభిమానించే వాళ్లు సైతం దీన్ని తప్పుబడుతున్నారు. బాయ్‌కాట్ చంద్రబాబు అంటూ ఎన్టీఆర్ ఎక్స్‌క్లూజివ్ ఫ్యాన్స్ ఆయన మీద తమ ఆగ్రహాన్ని కూడా చూపిస్తున్నారు ట్విట్టర్లో.