టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ తాజాగా ‘మిషన్ రాయలసీమ’ ప్రకటించారు. ప్రస్తుతం కడప జిల్లాలో యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్.. ఇప్పటికే సీమలో కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పాదయాత్ర ను పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాయలసీమ సమస్యలకు పరిష్కారం చూపుతూ.. టీడీపీ అధికారంలోకి వస్తే.. ఏం చేస్తామో వివరిస్తూ.. మిషన్ రాయలసీమ పేరుతో హామీల వరద పారించారు.
ఇవీ.. హామీలు..
వలస కూలీలకు ఉపశమనం. ఉద్యాన సాగు పెంచడానికి ప్రోత్సాహం. 90% రాయితీపై బిందు, తుంపర సేద్య పరికరాలు. ఉద్యాన పరిశోధనా కేంద్రాల ఏర్పాటు. టమాటాకు వాల్యూ చైన్ ఏర్పాటు. పెట్టుబడి తగ్గించి, గిట్టుబాటు ధర కల్పన. గుజ్జు పరిశ్రమల ఏర్పాటు. మిర్చి, పసుపు కొనుగోలుకు కేంద్రాల ఏర్పాటు. ఉద్యాన పంటలను ఉపాధి హామీకి అనుసంధానం. రైతులకు రూ.20 వేలు చొప్పున భరోసా. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరల్ని తగ్గించేందుకు కార్యాచరణ ప్రణాళిక. రాష్ట్రాన్ని విత్తన హబ్‌గామార్పు.
పంటలకు పాత బీమా పథకం అమలు. రైతుబజార్ల సంఖ్య పెంపు. కౌలు రైతులను గుర్తించి.. భూ యజమానులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాయం. పేదలకు ఉచితంగా గొర్రెలు, మేకలు. పాడి రైతులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్రణాళిక. గోకులాల ఏర్పాటు. గొర్రెలు, మేకలు పెంపకం కోసం ప్రత్యేక సాయం. పేదలకు ఉచితంగా గొర్రెలు, మేకలు పంపిణీ. పాడిరైతులకు రాయితీపై రుణాలు అందచేత.
ఇంటింటికి తాగునీరు. వాటర్ గ్రిడ్ ఏర్పాటు. పెట్రోలు, డీజిల్ ధరల్ని తగ్గింస్తాం.
లోకేష్ ఏమన్నారంటే..
“కుప్పం నుంచి కడప వరకు.. 119 రోజులుగా 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,516 కి.మీ. పాదయాత్ర చేశా. సీమ ప్రజల కష్టాలు చూశాను. అందరి కన్నీళ్లు తుడుస్తా. అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధి బాట పట్టిస్తాను. అందుకే ఈ ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా ‘మిషన్ రాయలసీమ’ ప్రకటిస్తున్నా..’’ అని లోకేష్ వెల్లడించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates