బీఆర్ఎస్ కు షాక్ కొట్టిన రైతు దినోత్సవం

తెలంగాణా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 22 రోజులు రాష్ట్రం మొత్తం ఉత్సవాలు జరపాలని కేసీయార్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఉత్సవాల్లో భాగంగా శనివారం రైతు దినోత్సవం జరిగింది. అయితే రైతుల దినోత్సవం బీఆర్ఎస్ కు పెద్ద షాకిచ్చింది. వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో పాటు ఎంపీలు, నేతలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు మొదలుకాగానే రైతులు, రైతుసంఘాల నుండి పెద్దఎత్తున వ్యతిరేకత మొదలైంది.

ధాన్యాన్ని ప్రభుత్వం ఎందకు కొనుగోలుచేయటం లేదో ముందు చెప్పాలని రైతులు మంత్రులు, ప్రజాప్రతినిధులను నిలదీశారు. కొనుగోలు కేంద్రాల్లో తాము రోజుల తరబడి వెయిట్ చేస్తున్నా అధికారులు తమను ఎందుకు పట్టించుకోవటంలేదని నిలదీశారు. తమ సమస్యలు చెప్పుకుంటున్నా ప్రజాప్రతినిధులు ఎందుకు లెక్కచేయటంలేదో చెప్పాలని మండిపడ్డారు. తమ సమస్యలను పట్టించుకోకుండా, ధాన్యాన్ని కొనకుండా మధ్యలో సంబురాలు ఏమిటంటు రైతులు రెచ్చిపోయారు.

వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని, నష్టపరిహారం చెల్లిస్తామని కేసీయార్ చెప్పినా ఇంతవరకు తమ ధాన్యాన్ని ఎందుకు కొనలేదని, పరిహారాన్ని ఎందుకు చెల్లించలేదని రైతులు ఆగ్రహంవ్యక్తంచేశారు. వ్యవసాయ రుణాల మాఫీ ఎందుకు కావటంలేదని నిలదీశారు. ఈ జిల్లా ఆ జిల్లా అనికాకుండా అన్నీ జిల్లాల్లో రైతుల నుండి ఇలాంటి వ్యతిరేకతే పెద్దఎత్తున ఎదురైంది. దాంతో ఏమి సమాధానం చెప్పాలో మంత్రులు, ప్రజాప్రతినిదులకు అర్ధంకాలేదు. తమది రైతుప్రభుత్వమని ఒకవైపు కేసీయార్ పదేపదే చెప్పుకుంటున్నారు.

ఇపుడు అదే రైతు సంబురాల్లో పాల్గొనేందుకు వచ్చిన మంత్రులు, ప్రజాప్రతినిధులను అందరిముందు నిలదీయటంతో సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ నేతలు బిక్కమొహాలేశారు. కరీంనగర్ లాంటి కొన్నిచోట్ల సంబురాలకు రైతులు హాజరుకాకపోవటంతో రైతు కూలీలను తీసుకొచ్చారు. రైతు కూలీలు కూడా గిట్టుబాటు ధరలు, కూలీగిట్టుబాటు పై మంత్రులు, ప్రజాప్రతినిదులను నిలదీశారు.  మెట్ పల్లి, సిరిసిల్ల లాంటి కొన్నిచోట్ల రైతులు సంబురాలను బహిష్కరించారు. మొత్తంమీద రైతుల నిరసనలు, ఆగ్రహాలు, బహిష్కరణల మధ్యే రైతు దినోత్సవాన్ని అధికారాపార్టీ నిర్వహించినట్లయ్యింది. మరీ ఫీడ్ బ్యాక్ అంతా కేసీయార్ దృష్టికి వెళ్ళిందో లేదో తెలీదు.