విమానం కూలిందంటే అందులోంచి మంటలు రావాల్సిందే. పేలుడు లాంటిది జరిగి అందులో ఉన్న ప్రయాణికుల్లో మెజారిటీ ప్రాణాలు కోల్పోవడం సహజం. కానీ కేరళలోని కోళికోడ్‌లో జరిగిన ప్రమాదంలో విమానం రెండు ముక్కలైంది కానీ అందులోంచి మంటలు రాలేదు. పొగ ఛాయలు సైతం లేవు. ఇది చాలామంది నిపుణులను సైతం ఆశ్చర్యపరిచిన విషయం. విమానం ల్యాండ్ అయ్యే సమయానికి ఓ మోస్తరుగానే ఇంధనం ఉంటుంది కాబట్టి.. అది కూలినపుడు మంటలు చెలరేగడం సహజం. కానీ కోళికోడ్ ప్రమాదంలో అలా జరగకపోవడానికి పైలట్ దీపక్ సాథె నైపుణ్యమే కారణం అన్నది అతడి సన్నిహితుల మాట. దీనిపై దీపక్ మిత్రుడొకరు ఫేస్బుక్లో పోస్టు కూడా పెట్టారు.
కార్గిల్ యుద్ధంలో కూడా పాల్గొన్న అనుభవమున్న దీపక్ సాథె.. కోళికోడ్ విమానాశ్రయంలో ఫ్లైట్‌ను ల్యాండ్ చేసే సమయంలో ప్రమాదం జరగబోతోందని ఊహించాడని.. అది తప్పదని అర్థమయ్యాక వెంటనే ల్యాండ్ చేయకుండా విమానాన్ని ఇటు అటు కొంతసేపు తిప్పాడని.. దీంతో ఇంధనం మొత్తం ఖాళీ అయిపోయిందని.. ఆ తర్వాత ల్యాండింగ్‌కు ప్రయత్నించగా.. విమానం అదుపు తప్పి కూలిపోయి రెండు ముక్కలైందని.. అయితే విమానంలో ఇంధనం లేకపోవడం వల్ల మంటలు చెలరేగడం, పొగలు రావడం లాంటివేమీ జరగలేదని.. ఇలా చేసి దీపక్ మెజారిటీ ప్రయాణికులను కాపాడాడని ఈ పోస్టులో దీపక్ మిత్రుడైన ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి తెలిపారు. కోళికోడ్ ప్రమాదంలో దీపక్‌తో పాటు కో పైలట్, 17 మంది ప్రయాణికులు ప్రాణాలు వదిలిన సంగతి తెలిసిందే.