టీడీపీ.. దీనికే సమాధానం చెబుతుంది?

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశం.. తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల మేనిఫెస్టోనే. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో మహ19-60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు నెలకు రూ.1500 చొప్పున నగదు బదిలీ.. స్కూలుకెళ్లే ప్రతి చిన్నారికీ అమ్మ ఒడి.. రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున సాయం.. ఇలాంటి ఆకర్షణీయ హామీలతో తెలుగుదేశం ప్రకటించిన మేనిఫెస్టో హాట్ టాపిక్‌గా మారింది.

సంక్షేమ పథకాల అమలుతో జగన్ ప్రభుత్వం తమ గుప్పెట్లో పెట్టుకున్న వర్గాలను ఆకర్షించడమే లక్ష్యంగా చంద్రబాబు అండ్ కో ఈ హామీలను ప్రకటించారన్నది స్పష్టం. ఉద్యోగులు, పట్టణ ప్రజలు, యువతలో జగన్ సర్కారు పట్ల తీవ్ర వ్యతిరేకత ఉండగా.. సంక్షేమ పథకాలతో గరిష్ట ప్రయోజనం పొందుతున్న గ్రామీణ జనాభా మాత్రం ఇంకా జగన్ వైపే ఉన్నారన్న అంచనాలున్నాయి. వారిని తమ వైపు తిప్పుకోవడానికి బాబు ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ ఈ హామీలని అభిప్రాయపడుతున్నారు.

ఐతే ఈ హామీల విషయంలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. దేశంలో ఇంకెక్కడా లేని విధంగా.. ఏపీలో సంక్షేమ పథకాలను హద్దులు దాటించేశారని.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి దివాళా తీయించేస్తున్నారని వైసీపీ మీద కొన్నేళ్ల నుంచి తెలుగుదేశం మద్దతుదారులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాస్త చదువుకున్న, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వారి అభిప్రాయం కూడా ఇదే. సంక్షేమ పథకాలు హద్దులు దాటితే జనం సోమరిపోతులుగా మారుతారని.. స్వప్రయోజనాలు చూసుకుని రాష్ట్ర ప్రగతి గురించి ఆలోచించారని.. కాల క్రమంలో ఇది విధ్వంసానికి దారి తీస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చంద్రబాబు ఆలోచన ధోరణి కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి.. ఆయన జగన్ తరహాలో సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వరనే నమ్మకంతో ఉన్నారు చాలామంది. కానీ జగన్‌ను మించి ఉచితాలు, సంక్షేమ పథకాలను ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. జగన్‌ను ఇంత కాలం విమర్శించిన వాళ్లు ఇప్పుడు బాబు ప్రకటించిన హామీల విషయంలో ఏమంటారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐతే తెలుగుదేశం వైపు నుంచి అప్పుడే ఈ విషయంలో సమాధానాలు రెడీ అయిపోయాయి.

సంపద సృష్టి లేకుండా.. కేవలం అప్పుల మీద ఆధారపడి సంక్షేమ పథకాలను అమలు చేయడం తప్పని.. చంద్రబాబు ఆ మార్గంలో వెళ్లరని.. ఆయనకు సంపద సృష్టించడం, ఆదాయం పెంచడం ఎలాగో తెలుసని.. రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో నడిపించి ఆయన విజయవంతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తారని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. ఈ వాదన ఎంత వరకు నిలబడుతుందో.. జనాలు ఈ హామీలను ఏమేర నమ్ముతారో.. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఈ హామీలను ఎంత వరకు నిలబెట్టుకుంటారో చూడాలి మరి.