మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సింగిల్ గానే బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్… ఘోరంగా ఓటమిపాలయ్యారు. ఆ ఓటమి నుంచి కాస్తంత ఊరట పొందుదామనుకున్నారో, ఏమో తెలియదు గానీ… ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో దోస్తీ కట్టేశారు.
అయితే బీజేపీతో దోస్తానాతో ఎన్నికల్లో ఎదురైన పరాభవం నుంచి తేరుకున్నట్టుగానే కనిపించినా… మొత్తంగా ఇప్పుడు పవన్ అడ్డంగా బుక్కైపోయారన్న వాదనలు కాస్తంత గట్టిగానే వినిపిస్తున్నాయి. అది కూడా తాను ఓ రేంజిలో కొనసాగించిన అమరావతి పోరులోనే పవన్ అడ్డంగా బుక్కైపోయారు.
ఎలాగంటే… జగన్ సీఎం కాగానే అమరావతి రాజధానిని కేవలం శాసన రాజధానిగా ఉంచేసి పాలనా రాజధానిని విశాఖకు, న్యాయ రాజధానిని కర్నూలుకు తరలిస్తానని చెప్పేశారు. ఆ దిశగా జగన్ వేగంగానే అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాజధానికి వేలాది ఎకరాల భూములిచ్చిన రైతులు నెలల తరబడి పోరు సాగిస్తున్నారు.
ఈ పోరుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పవన్ ఇప్పటికే ప్రకటించారు. రాజధాని ప్రాంతంలో పర్యటించారు కూడా. టీడీపీ అధికారంలో ఉండగా కూడా రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం పాటు పడతానని పవన్ బహాటంగానే ప్రకటించారు. మొత్తంగా రాజధాని రైతులకు ఎలాంటి అన్యాయం జరిగినా… తానున్నానంటూ పవన్ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు.
మరి ఇప్పుడేమైందంటే… ఏపీ రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదేనని, అందులో కేంద్రం జోక్యం ఉండబోదని బీజేపీ సర్కారు విస్పష్టంగా ప్రకటించేసింది. ఈ మేరకు ఏకంగా ఏపీ హైకోర్టుకే తన వైఖరిని చెప్పేసింది. మరి ఇప్పుడు తాను జత కట్టిన పార్టీ బీజేపీ అమరావతి పోరుకు అల్లంత దూరాన నిలబడగా.. ఆ పార్టీ మిత్రపక్షంగా పవన్ ఎలా పోరు సాగిస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
అంతేకాకుండా అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించే విషయంతో తమకు ఎంతమాత్రం సంబంధం లేదని ప్రకటించిన బీజేపీతో దోస్తానాను కంటిన్యూ చేస్తున్న పవన్ ను రాజధాని రైతులు నమ్మే పరిస్థితులు కూడా సన్నగిల్లుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అంటే… అమరావతిని చిదిమేసేలా సాగుతున్న జగన్ పై రాజధాని రైతులు ఏ మేర ఆగ్రహంతో ఉన్నారో, రాజధానితో తమకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పిన బీజేపీతో సాగుతున్న పవన్ పైనా అంతే ఆగ్రహంతో ఉన్నారన్న మాట. మొత్తంగా బీజేపీతో దోస్తానాతో పవన్ త్రిశంకు స్వర్గంలో నిలబడిపోయారన్న మాట.