ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా తెలంగాణాలోని బీఆర్ఎస్ కూడా ఎన్టీఆర్ జపం మొదలుపెట్టినట్లుంది. లేకపోతే ఇంతకాలం అసలు ఎన్టీఆర్ ఊసే ఎత్తని బీఆర్ఎస్ నేతలు శతజయంతి సందర్భంగా దాదాపు అన్నీ నియోజకవర్గాల్లో ఎన్టీయార్ కు జిందాబాదలు కొట్టడం ఏమిటి ? ఎన్టీయార్ విగ్రహాలను ఏర్పాటు చేయటం, విగ్రహాలకు నివాళులు అర్పించటం, ఎన్టీయార్ ఘాట్ దగ్గర శ్రద్ధాంజలి ఘటించటం అంతా విచిత్రంగా ఉంది. ఇదంతా ఎందుకు చేశారంటే రాబోయే ఎన్నికల్లో ఓట్లకోసమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఎన్టీఆర్ ఘాట్ దగ్గర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన మద్దతుదారులతో వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. తర్వాత చిత్రపురి కాలనీ, కూకట్ పల్లి, మోతీనగర్, కేపీహెచ్బీ కాలనీలోని వసంతనగర్లో ఏర్పాటుచేసిన ఎన్టీయార్ కాంస్యవిగ్రహాన్ని ఆవిష్కరించారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎంఎల్ఏలు ఆరెకపూడి గాంధి, మాధవరం కృష్ణారావు, ప్రకాష్ గౌడ్ తదితరులు ఫిలింనగర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళుర్పించారు. ఖమ్మం ట్యాంక్ బండ్ మీద 54 అడుగుల ఎన్టీయార్ విగ్రహాన్ని ప్రతిష్టించాలని మంత్రి పువ్వాల అజయ్ కుమార్ చేసిన ప్రయత్నం విఫలమైంది.
హన్మకొండలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. నిజామాబాద్ నియోజకవర్గంలోని వర్లి మండలకేంద్రంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఇంత హఠాత్తుగా బీఆర్ఎస్ నేతలకు ఎన్టీయార్ మీద ప్రేమ ఎందుకు పొంగిపోయింది ? ఎందుకంటే రేపటి ఎన్నికల్లో ఓట్ల కోసమే అని స్పష్టమవుతోంది.
నిజానికి వీళ్ళెవరికీ ఎన్టీయార్ మీద అపారమైన ప్రేమేమీ లేదు. ముఖ్యంగా హైదరాబాదులో నిర్ణాయక సంఖ్యలో ఉన్న కమ్మవారి ఓట్లు అలాగే ఎన్టీయార్ అభిమానుల ఓట్లు రావాలని, వస్తాయన్న ఆశతోనే బీఆర్ఎస్ నేతలంతా ఎన్టీయార్ జపం చేస్తున్నది వాస్తవం. రేపటి ఎన్నికల్లో టీడీపీ అన్నీ నియోజకవర్గాల్లో పోటీచేయటానికి రెడీ అవుతోంది. టీడీపీ అభ్యర్ధులు గనుక యాక్టివ్ గా తిరిగితే కమ్మ ఓట్లు, ఎన్టీయార్ అభిమానులు ఓట్లు బీఆర్ఎస్ కు మైనస్ అవుతాయేమో అనే భయం మొదలైనట్లుంది. అందుకనే ఎన్టీయార్ మీద ప్రేమకురిపిస్తున్నారు. మరి వీళ్ళ ఎన్నికల ప్రమకు ఓట్లు కురుస్తాయా ?