తొందరలోనే రాయలసీమ రోడ్ మ్యాప్

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్నది చంద్రబాబునాయుడు ప్రయత్నం. అధికారంలోకి రాకపోతే పార్టీ భవిష్యత్తు ఏమిటో మిగిలిన వారికన్నా చంద్రబాబుకే ఎక్కువగా తెలుసు. అందుకనే 74 ఏళ్ళ వయసులో కూడా శ్రమ అనుకోకుండా రెగ్యులర్ గా జనాల్లోనే ఉంటున్నది. ఒకవైపు చంద్రబాబు జిల్లాల్లో పర్యటిస్తుండగానే మరోవైపు లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం పాదయాత్ర రాయలసీమలో జరుగుతోంది. మహానాడు సందర్భంగా నాలుగురోజులు విరామమిచ్చారు.

మహానాడులో లోకేష్ మాట్లాడుతు రాయలసీమకు పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు చెప్పారు. తొందరలోనే రాయలసీమ కోసం ప్రత్యేకంగా రోడ్డుమ్యాపు రెడీ చేస్తామన్నారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో 52 అసెంబ్లీ సీట్లున్నాయి. వీటిల్లో 2019 ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పాలి. ఎందుకంటే 52 సీట్లలో వైసీపీ 49 నియోజకవర్గాల్లో గెలిచింది. కుప్పం, హిందుపురం, ఉరవకొండలో మాత్రమే టీడీపీ గెలిచింది. రాబోయే ఎన్నికల్లో కనీసం సగం సీట్లయినా గెలవాలన్నది చంద్రబాబు టార్గెట్ .

ఇందుకని ముఖ్యంగా యువత అందులోను రెడ్డి సామాజికవర్గం నుండి గట్టి అభ్యర్ధులను పోటీలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రాయలసీమ మొత్తంమీద రెడ్డి సామాజికవర్గందే డామినేషన్ అని అందరికీ తెలిసిందే. అనంతపుర, కర్నూలు, కడప, చిత్తూరు ఇలా ఏ జిల్లా చూసినా వాళ్ళదే పైచేయి. కాబట్టి రాబోయే ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గంలోని బలమైన నేతలను పోటీలోకి దింపాలని చంద్రబాబు అనుకున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఇప్పటివరకు టికెట్లు ప్రకటించిన నేతల్లో కూడా రెడ్లే అత్యధికంగా ఉన్నారు.

రెడ్ల తర్వాత బీసీలు, బలిజలు కూడా బాగానే ఉన్నారు. కాబట్టి రెడ్డి-బీసీ-బలిజ సామాజికవర్గాల కాంబినేషన్లో టికెట్లిచ్చి గట్టి నేతలను పోటీలోకి దింపాలన్నది చంద్రబాబు ఆలోచన. కర్నూలు, అనంతపురంలో రెడ్లతో పాటు బీసీ సామాజికవర్గం కూడా ఎక్కువే. ఇక కడపలో దాదాపు రెడ్లదే పైచేయి. మిగిలిన చిత్తూరులో రెడ్లతో పాటు కమ్మ, బలిజలు కూడా ఉన్నారు. కాకపోతే కమ్మ ఆధిపత్యం తక్కువనే చెప్పాలి. అందుకనే రెడ్డి, బలిజ సామాజికవర్గమే ఎక్కువగా కనబడుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే లోకేష్ తొందరలోనే రాయలసీమ రోడ్డుమ్యాపని చెప్పింది.