ఏపీ లో కొత్త జిల్లా ఏర్పాటుకు ముందడుగు పడింది. 25 జిల్లాల ఏర్పాటుకు కమిటీ ఏర్పాటైంది. అధ్యయనం కోసం ఏర్పాటైన ఈ కమిటీ కొత్త జిల్లాల ఏర్పాటులో ఎదురయ్యే ఆటంకాలు, పరిష్కరాలు, రాజకీయ సామాజిక పరిస్థితులను కూలంకుషంగా పరిశీలించనుంది.
ఈ అధ్యయన కమిటీలో ఆరుగురు సభ్యులున్నారు. సీఎస్ నీలం సాహ్ని అధ్యక్షత వహిస్తారు. సభ్యులుగా సీసీఎల్ఏ కమిషనర్, జీఏడీ కార్యదర్శి, ప్రణాళికశాఖ కార్యదర్శి, సీఎంవో అధికారి, ప్రిన్సిపల్ ఫైన్సాన్స్ సెక్రటరీ ఉంటారు. వనరుల విభజనలో సమతూకం కోసం ఆరుగురు ఆరు వేర్వేరు శాఖల నుంచి ప్రాతినిధ్యం ఉండేలా చూస్తున్నారు. ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ కమిటీ కన్వీనర్ గా వ్యవహరిస్తారు.
మూడు నెలల్లోపు కమిటీ నివేదిక ఇవ్వాలని నిర్దిష్ట గడువు విధించారు. కమిటీ ఏర్పాటుపై చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఒక్కో లోక్ సభ నియోజకవర్గం యూనిట్ గా జిల్లాలు ఏర్పాటు చేస్తామని వైఎస్ జగన్ ముందు నుంచి చెబుతున్నారు. ఏపీలో మొత్తం 25 జిల్లాలు లేదా అంతకంటే ఎక్కువ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అయితే విశాఖలోని అరకు లోక్ సభ నియోజకవర్గాన్ని మాత్రం రెండు జిల్లాలు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఉంది. విస్తీర్ణం రీత్యా ఇది పెద్దది. మొత్తం నాలుగు జిల్లాల్లో ఇది విస్తరించింది. అరకు ఎంపీ నియోజకవర్గంలోని పాలకొండ శ్రీకాకుళం జిల్లాలో, సాలూరు, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాలు విజయనగరం జిల్లాలో ఉన్నాయి. అరకు, పాడేరు విశాఖపట్నం జిల్లాలో కొనసాగుతుండగా, రంపచోడవరం మాత్రం తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉంది. మొత్తం గిరిజన జనాభాయే. అందుకే దీనిపై ఒక సందిగ్దత నెలకొంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates