కాంగ్రెస్ టార్గెట్ ఫిక్సయ్యిందా ?

కర్నాటకలో సాధించిన ఘన విజయంతో కాంగ్రెస్ మంచి జోష్ మీదుంది. ఆ ఊపులోనే తొందరలోనే ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో కూడా విజయాలు సాధించాలని గట్టిపట్టు మీదుంది. ఈ ఏడాది చివరలోగా రాజస్ధాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘర్, తెలంగాణాకు ఎన్నికలు జరగాల్సుంది. వీటిల్లో రాజస్ధాన్, ఛత్తీస్ ఘర్లో ఇప్పటికే అధికారంలో ఉంది. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవటమే ముఖ్యం.

అలాగే మధ్యప్రదేశ్ లో అధికారంలోకి వచ్చి అంతర్గత కలహాల కారణంగా తన ప్రభుత్వాన్ని తానే కాంగ్రెస్ కూలదోసేసుకున్నది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలని పెద్ద టార్గెట్ పెట్టుకున్నది. ఇక మిగిలింది తెలంగాణా. ఇక్కడ నేతల్లో ఏమాత్రం సఖ్యతలేదు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేంద్రంగా సీనియర్లలో వ్యతిరేక గ్రూపులు చాలాఉన్నాయి. ఇక్కడ అధికారంలోకి రావాలంటే ఒకరకంగా కష్టం మరోరకంగా అవకాశముందనే చెప్పాలి.

ముందు నేతల్లో సఖ్యత వచ్చి అందరు ఏకతాటిమీద నిలబడాలి. అభ్యర్ధుల ప్రకటన, ప్రచారం అంతా ఉమ్మడిగా చేయాలి. ఎలక్షనీరింగ్ ను జాగ్రత్తగా చేసుకోగలిగితే ఎక్కువసీట్లను గెలుచుకునే అవకాశముంది. అన్నీ రాష్ట్రాల్లోను సంక్షేమపథకాలనే కాంగ్రెస్ నమ్ముకుంది. కర్నాటకలో విజయం సాధించిన సూత్రాన్ని పై రాష్ట్రాల్లో కూడా అమలుచేయాలన్నది అధిష్టానం నిర్ణయం. అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రు.1500 పెన్షన్, రు. 500 కే వంటగ్యాస్, ఉద్యోగాల కల్పన లాంటి హామీల ద్వారా మహిళలు, యువత, రైతులను ఆకర్షించాలని టార్గెట్ పెట్టుకున్నది.

మధ్యప్రదేశ్ లోని 230 సీట్లలో బీజేపీకి 130 ఉంటే కాంగ్రెస్ 96 సీట్లతో బలమైన ప్రతిపక్షంగానే ఉంది. 90 సీట్ల ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ 71 సీట్లతో తిరుగులేని అధికారంలో ఉంది. ఇక రాజస్ధాన్లో సీఎం అశోక్ గెహ్లాట్ ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారు. తెలంగాణాలో ప్రియాంకగాంధి పర్యటన సందర్భంగా రైతులకు, యువతకు, మహిళలకు కొన్ని హామీలిచ్చారు. ఇవన్నీ జనాల్లోకి వెళ్ళాలంటే నేతలంతా కలిసికట్టుగా ప్రచారం చేస్తేనే సాధ్యమవుతుంది. మరి హస్తంపార్టీ నేతలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తారా ?