పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ చేపట్టారు. ఈ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సుదీర్ఘంగా ప్రసంగించారు. వందేమాతరం స్ఫూర్తిని ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తి కర పరిణామం జరిగింది. వందేమాతరం రూపకర్త బంకిమ్ చంద్ర ఛటర్జీని పలుమార్లు ప్రధాని మోదీ.. బంకిమ్ దా అంటూ సంబోధించారు. దీనిపై సభలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత్ రాయ్ అభ్యంతరం చెప్పారు.
ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలోనే బంకిమ్ దా.. అని కాదంటూ తెలిపారు. దీంతో ఒక్కసారిగా ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ఆపివేశారు. ‘బంకిమ్ దా కాదు.. బంకిమ్ బాబు అనాలి,” అన్నారు. బెంగాళీలో ‘దా’ అనేది సాధారణంగా అన్న, స్నేహితుడు లేదా పరిచయస్తులకు వినియోగించే పదమని ఎంపీ సౌగత్ రాయ్ వివరించారు. వెంటనే సరిచేసుకున్న మోదీ ఇక నుంచి బంకిమ్ బాబు అని సంబోధిస్తానని అన్నారు.
‘సరే, బంకిమ్ బాబు అని చెబుతాను. మీ భావాలను గౌరవిస్తున్నాను..’ అని అన్నారు. ఆ క్రమంలోనే మిమ్మల్ని కూడా నేను దాదా అని పిలిస్తే అభ్యంతరం ఏమైనా ఉందా అని చమత్కరించారు. దీంతో సభలో నవ్వులు పూశాయి. మోదీ ప్రసంగం చేస్తుండగా జరిగిన ఈ ఘటన ఆసక్తిని రేకెత్తించింది. మోదీ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ వందే మాతరం కేవలం ఒక మంత్రం కాదు, నినాదం కాదన్నారు.
భారతమాతను వలస పాలన నుంచి విముక్తి చేయాలనే పవిత్ర యుద్ధ పిలుపు అని అన్నారు. వందే మాతరం స్వాతంత్ర్యం కోసం మాత్రమే కాదు. అది రాజకీయ స్వాతంత్ర్యాన్ని దాటి, దేశాన్ని బానిసత్వం నుంచి విముక్తం చేయాలనే మహోన్నత లక్ష్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఈ 150 ఏళ్ల సంబరాలను మనం సాక్ష్యులుగా చూడడం గర్వకారణం అని ప్రధాని పేర్కొన్నారు. కాగా ఈరోజు పార్లమెంటు సమావేశాలకు ప్రతిపక్ష నేత రాహుల్, సోనియా గాంధీ హాజరు కాకపోవడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates