బీఆర్ఎస్ `విజ‌య్ దివ‌స్‌`… ఇప్పుడే ఎందుకు?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తొలిసారి `విజ‌య్ దివ‌స్‌` పేరుతో కీల‌క కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న‌(మంగ‌ళ‌వారం) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా బీఆర్ ఎస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఏం చేసిందో ప్ర‌తి ఒక్క‌రికీ తెలియ‌జేయాల‌ని కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆ రోజు(9న‌) అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీ కార్యక్ర‌మాలు నిర్వ‌హించాల‌ని కూడా కేటీఆర్ సూచించారు. కేసీఆర్ ఈ రాష్ట్రం కోసం చేసిన త్యాగాల‌ను.. వివ‌రించాల‌ని.. ప్ర‌తి ఒక్క‌రికీ అర్ధ‌మ‌య్యేలా చేయాల‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు.

అస‌లేంటిది?

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు అనేక ఉద్య‌మాలుజ‌రిగాయి. వీటిలో కేసీఆర్ కీల‌క పాత్ర పోషించారు. అనేక రూపాల్లో కేంద్రంపైనా ఒత్తిడి తెచ్చారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేప‌ట్టారు. దీక్ష చేప‌ట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ఇటీవ‌ల రాష్ట్ర వ్యాప్తంగా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు.. అదే దీక్ష విర‌మించిన రోజును పుర‌స్క‌రించుకుని `విజ‌య్ దివ‌స్‌` పేరుతో రాష్ట్ర వ్యాప్త కార్య‌క్ర‌మాల‌కు పిలుపునివ్వ‌డం గ‌మ‌నార్హం. 2009, డిసెంబ‌రు 9న కేసీఆర్ గాంధీ ఆసుప‌త్రిలో దీక్ష విర‌మించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ దీక్ష విర‌మ‌ణ‌పై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం కావ‌డం.. విద్యార్థులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం కూడా గుర్తుండే ఉంటుంది.

ఇప్పుడే ఎందుకు?

వాస్త‌వానికి ఇలాంటి రోజుల‌ను పురస్క‌రించుకుని ఏదైనా కార్య‌క్ర‌మం చేయాలంటే.. తెలంగాణ వ‌చ్చాక‌.. ముఖ్యంగా బీఆర్ ఎస్ అధికారంలో ఉన్న ప‌దేళ్ల‌లో నిర్వ‌హించి ఉండాలి. కానీ.. అప్ప‌ట్లో బీఆర్ఎస్ పార్టీ.. కేసీఆర్ దీక్ష చేప‌ట్టిన రోజునుకానీ.. విర‌మించిన రోజును కానీ.. ఎప్పుడూ పండుగ‌లా నిర్వ‌హించ‌లేదు. పాల‌నా ప‌ర‌మైన కార్య‌క్ర‌మాల‌కే ప‌రిమితం అయ్యారు. కానీ, ఇప్పుడు మాత్రం ఈ రెండు కార్య‌క్ర‌మాల‌కు పిలుపునివ్వ‌డం గ‌మ‌నార్హం. దీంతో దీనివెనుక రాజ‌కీయ వ్యూహం ఉందా? అనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వాస్త‌వానికి శ్రీకాంతాచారి వంటి అనేక మంది యువ‌కులు త‌మ‌ను తాను బ‌లిదానం చేసుకున్న రోజుల‌ను నిర్వ‌హించాల‌న్న చ‌ర్చ ఉన్న‌ప్ప‌టికీ.. వాటిని ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి.

యాదృచ్ఛిక‌మే అయినా..

ఇక‌, కేటీఆర్ పిలుపునిచ్చిన డిసెంబ‌రు 9వ తేదీ విజ‌య్ దివ‌స్‌కు.. రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న తెలంగాణ రైజింగ్ స‌ద‌స్సు అదే రోజు కూడా జ‌ర‌గ‌నుంది. ఆ రోజును ప్ర‌బుత్వం ప్ర‌త్యేకంగా నిర్వ‌హిస్తోంది. ఖ‌చ్చితంగా అదే రోజు.. యాదృచ్ఛికంగా.. కేసీఆర్ దీక్ష విర‌మించిన రోజు కూడా కావ‌డం.. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ ఎస్ నాయ‌కులు, శ్రేణులు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాలంటూ పిలుపుని వ్వ‌డం వెనుక‌.. చాలా కీల‌క ఉద్దేశం ఉండి ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.