ముఖ్యమంత్రి పదవికి తీవ్రపోటి ఇచ్చి చివరి నిముషంలో వెనక్కు తగ్గిన డీకే శివకుమార్ విషయంలో సోనియాగాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారట. చివరి నిముషంలో సోనియా జోక్యంతోనే డీకే వెనక్కు తగ్గినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. డీకే వ్యాఖ్యలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. సోనియా నిర్ణయాన్ని డీకే కోర్టు తీర్పుతో పోల్చటమే ఇందుకు ఉదాహరణ. ఇంతకీ విషయం ఏమిటంటే రెండు అంశాలపై డీకేని సోనియా కన్వీన్వ్ చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.
అవేమిటంటే మొదటిది తొందరలో రాబోయే పార్లమెంటు ఎన్నికలు. రెండోది సీబీఐ, ఈడీ కేసులు. ఇపుడు డీకే గనుక సీఎం అయితే వెంటనే దర్యాప్తు సంస్థలు డీకేని విచారించాలని, అరెస్టటని నానా గోలచేస్తాయి. దాంతో పార్టీ పరువు గంగలో కలిసిపోతుంది. దీని ప్రభావం రాబోయే పార్లమెంటు ఎన్నికలపైన పడుతుందని డీకేకి సోనియా నచ్చచెప్పారట. ముందు కేసులను క్లియర్ చేసుకునే విషయమై దృష్టిపెట్టమని గట్టిగా చెప్పారట. ఒకసారి కేసుల్లో నుండి బయటపడితే అప్పుడు సీఎం పోస్టులో కూర్చోవచ్చని చెప్పటంతో డీకే కూడా అంగీకరించారని సమాచారం.
అలాగే తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో డీకేకి సోనియా కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్లమెంటు ఎన్నికల్లో గెలవటం కాంగ్రెస్ కు చాలా అవసరం. రాబోయే ఎన్నికల్లో జాతీయ స్ధాయిలో పార్టీని సమన్వయం చేసే బాధ్యతలను డీకే మీదుంచబోతున్నట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులతో తొందరలోనే సోనియా కమిటి వేయబోతున్నారట. అందులో డీకేని కూడా చేర్చి పార్టీని గెలిపించే బాధ్యతలను అప్పగించబోతున్నట్లు డీకేతో సోనియా చెప్పారట.
ముఖ్యమంత్రిగా ఉంటే పార్టీ సమన్వయ బాధ్యతలను నెరవేర్చటం కష్టమని సోనియా నచ్చచెప్పారట. దాంతో డీకే కూడా అందుకు అంగీకరించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే డీకే ప్రాధాన్యత తగ్గకుండా డిప్యుటి సీఎం పదవితో పాటు పీసీసీ అధ్యక్షుడిగా కంటిన్యు అయ్యేట్లు హామీ ఇచ్చారు. అంటే ఇపుడు డీకేకి జోడుపదవులన్నమాట. ఒక నేతకు రెండుపదవులు ఉండకూడదన్న రాజస్ధాన్ తీర్మానాన్ని డీకే విషయంలో పార్టీ పక్కనపెట్టేసింది. ఈ రెండు కారణాల వల్లే సోనియా చెప్పిందానికి డీకే అంగీకరించారని సమాచారం.