కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఊహించని విధంగా విజయం అందుకుంది. నిజాని కి కాంగ్రెస్ నాయకులు కూడా ఈ తరహా అంచనాలు వేయలేదు. మహా వస్తే.. 115-120 మధ్యే ఆగిపోయారు. అది కూడా ఒకరిద్దరే. కానీ, 39 ఏళ్ల చరిత్రనుతిరగరాసిన కన్నడ ఓటరు ఏకంగా.. 136 స్థానాల్లో హస్తం పార్టీ కి ఓట్లతో అభిషేకం చేశారు. ఫలితగా కనీవినీ ఎరుగని రీతిలో కాంగ్రెస్ పార్టీ విజయం దక్కించుకుంది.
ఇక, ఈ విజయం తర్వాత.. ఇప్పుడు తాజాగా కొన్ని కొన్ని విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇవే.. ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీని కలవరానికి గురి చేస్తున్నాయి. బీజేపీ పాలనతో విసిగిపోయిన.. కొన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా కూటములు కట్టి.. బీజేపీకి వ్యతిరేకంగా అంతర్గత ప్రచారం చేశారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటేయాలని ఆయా వర్గాల మద్య పిలుపులు ఇచ్చారు. దీంతో బీజేపీకే తెలియకుండా.. జరిగిన ఈ అంతర్గత.. అంతర్లీన ప్రచారంతో ఆ పార్టీ మట్టి కరిచిందని అంటున్నారు.
నిజానికి కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి కారణం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కారణమని కొందరు, కాంగ్రెస్ మీద ప్రజల అభిమానం కారణమని కొందరు, బీజెపి ప్రభుత్వంపై వ్యతిరేకత, దేశవ్యాప్త బీజెపి విధానాలపట్ల వ్యతిరేకత కారణమని విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ ఫలితాల్లోంచి ఎవరికి ఇష్టమైన కారణాన్ని వారు వెతుక్కుంటున్నారు. అయితే ఈ ఫలితాల వెనక కొందరి శ్రమ, మత రాజకీయాల పట్ల వారికున్న వ్యతిరేకత, 6 నెలల పాటు 5 వేల మంది చేసిన కృషి ఉన్నాయని తాజాగా వెలుగు చూసింది.
నిజానికి వీరెవరూ కూడా పార్టీలకు సంబంధించిన వారు కాదని సమాచారం. కర్నాటకలో బీజేపీ మత రాజకీయాలు, అవినీతి, దోపిడీ, ఒంటెత్తు పోకడలతో రిజర్వేషన్లు రద్దు చేయడంతో విసిగిపోయిన కొందరు మేదావులు, లాయర్లు, జర్నలిస్టులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, వివిధ రంగాల ప్రజలు, అనేక స్వచ్చంద సంస్థలు చేతులు కలిపి సాగించిన పోరాటఫలితంగానే బీజేపీ మట్టి కరిచిందని చెబుతున్నారు.
కట్ చేస్తే.. ఇప్పుడు ఏపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. పార్టీలకు అతీ తంగా లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు, మేధావి వర్గాలు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు కూడా కూటములు కట్టి.. వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉందని.. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా సాగుతున్నాయని కొందరు అంటున్నారు. ఇదే జరిగితే.. వైసీపీ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇదే విషయంపై వైసీపీలోనూ అంతర్గత చర్చలు జరుగుతుండడం గమనార్హం. ఏదేమైనా.. రాజకీయాలకన్నా.. ప్రజల విల్ పవర్ గొప్పదనే విషయం కర్నాటకలో తేలిపోయిన దరిమిలా.. ఏపీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.