తెలుగుదేశం పార్టీ అట్టహాసంగా జరుపుకునే పసుపు పండుగ మహానాడు ఏర్పాట్లు జోరందుకుంటున్నాయి. ఈనెల 27,28 తేదీల్లో మహానాడును ఘనంగా రాజమండ్రిలో జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పుట్టినరోజు మే 28వ తేదీన మహానాడును జరుపుకోవటం పార్టీకి ఆనవాయితీగా వస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు వివిధ కారణాల వల్ల మహానాడు నిర్వహణకు అంతరాయాలు కలిగినా మొత్తం మీద రాబోయే పండుగను మాత్రం బ్రహ్మాండంగా జరుపుకోబోతున్నారు.
రాజమండ్రికి సమీపంలోని వేమగిరికి దగ్గర్లోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న 50 ఎకరాల్లో మహానాడు జరగబోతోంది. సభా ప్రాంగణం పర్యవేక్షణ కమిటీ అధ్యక్షుడు, రాజమండ్రి రూరల్ ఎంఎల్ఏ గోరంట్ల బుచ్చయ్య చౌదరి దగ్గరుండి అన్నీ ఏర్పాట్లను చూసుకుంటున్నారు. జేసీబీలను పెట్టి మొత్తం స్ధలాన్ని చదునుచేయిస్తున్నారు. 27వ తేదీన ప్రతినిధుల సభ నిర్వహణకు వేదిక తదితరాలకు 10 ఎకరాల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మొదటిరోజు అంటే 27వ తేదీన జరగబోయే ప్రతినిధుల సభకు 15 వేల మంది హాజరవుతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ప్రతినిధులతో పాటు పార్టీలోని వివిధ స్ధాయిల్లోని ప్రజాప్రతినిదులు, నేతలు, క్యాడర్ అంతా కలిసి సుమారు 50 వేలమంది భోజనాలు చేస్తారని అంచనా వేస్తున్నారు. ఎందుకైనా మంచిదని లక్షమందికి గోదావరి రుచులు చూపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండోరోజు అంటే 28వ తేదీన కీలకమైన సమావేశాల తర్వాత భారీ బహిరంగ సభ కూడా జరగబోతోంది. బహిరంగ సభకు సుమారు 15 లక్షలమంది హాజరవుతారని అంచనాలు వేస్తున్నారు.
భోజన ఏర్పాట్లు తదితరాల కోసం గోరంట్ల ఆధ్వర్యంలో దేవినేని ఉమామహేశ్వరరావు, నిమ్మకాయల చినరాజప్ప, ఆదిరెడ్డి అప్పారావు, జ్యోతుల నెహ్రూతో కమిటీ ఏర్పాటైంది. పనిలోపనిగా నగరం సుందరీకరణ పనుల కోసం ఆదిరెడ్డి వాసు, గన్ని కృష్ణ, వేణుగోపాలరావు తదితరులతో మరో కమిటి పనులను పర్యవేక్షిస్తోంది. నగరం మొత్తం పసుపుమయం చేసేయాలన్న పట్టుదలతో ఈ కమిటి పనిచేస్తోంది. ఈ మహానాడులో పొత్తులు, అభ్యర్ధుల ప్రకటన, పరిచయం, మ్యానిఫెస్టో ఉంటాయని పార్టీవర్గాలు చెబుతున్నాయి. మరి చివరకు చంద్రబాబునాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.