బీజేపీ ఓట‌మి.. ప్ర‌కాష్ రాజ్ ట్వీట్ వైర‌ల్

తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారం చ‌లాయిస్తూ.. ప‌లు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు గెలుస్తూ.. త‌మ‌కు మెజారిటీ లేని చోట కూడా వ‌క్ర మార్గాల్లో అధికారం చేజిక్కించుకుంటూ దేశ రాజ‌కీయాల్లో ఆధిప‌త్యాన్ని చాటుతూ వ‌స్తోంది భార‌తీయ జ‌న‌తా పార్టీ. అలాంటి పార్టీకి శ‌నివారం గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. ద‌క్షిణాదిన అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం బీజేపీ చేజారింది.

ఆ పార్టీ ఓట‌మి ఊహించిందే కానీ.. మ‌రీ ఈ స్థాయిలో చిత్త‌వుతుంద‌ని.. కాంగ్రెస్ పార్టీ అంత ఘ‌నంగా గెలుస్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. ఎగ్జిట్ పోల్స్ కూడా హంగ్ అసెంబ్లీని సూచించాయి. ఫ‌లితాలు మాత్రం అందుకు భిన్నంగా వ‌చ్చాయి. బీజేపీని వ్య‌తిరేకించే వారంతా ఈ రోజు మామూలు ఆనందంలో లేరు. ఆ పార్టీ అంటే అస్స‌లు ప‌డ‌ని సీనియ‌ర్ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ సంబ‌రం గురించి చెప్పేదేముంది?

చాలా ఏళ్ల నుంచి ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో బీజేపీకి వ్య‌తిరేకంగా త‌న స్వ‌రాన్ని గ‌ట్టిగా వినిపిస్తున్నాడు ప్ర‌కాష్ రాజ్. కొన్నిసార్లు ఆయ‌న ట్వీట్లు శ్రుతి మించాయి కూడా. ఈ మ‌ధ్యే మోడీని హిట్ల‌ర్‌తో పోలుస్తూ ఆయ‌న వేసిన ట్వీట్ ఎంత దుమారం రేపిందో తెలిసిందే. ఇక ఎన్నిక‌ల ఫ‌లితాల నేప‌థ్యంలో ప్ర‌కాష్ రాజ్ వేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

మోడీ, యోగి, అమిత్ షా మొత్తం బీజేపీ స‌రంజామా అంతా ఒక బండిలో స‌ర్దుకుని వెళ్లిపోతున్న‌ట్లుగా ఉంది ఆ ట్వీట్. ద్వేషం నిండిన‌, విభ‌జిత రాజ‌కీయాలు చేసే బీజేపీని త‌న్ని త‌రిమేసిన క‌న్న‌డిగుల‌కు కృత‌జ్ఞ‌త‌లు అంటూ.. చ‌క్ర‌వ‌ర్తిని న‌గ్నంగా నిల‌బెట్టార‌ని అత‌ను పేర్కొన్నాడు. బీజేపీ వ్య‌తిరేకుల‌కు ఈ ట్వీట్ బాగా న‌చ్చి దాన్ని వైర‌ల్ చేస్తున్నారు. మ‌రోవైపు ఉద‌యం నుంచి బీజేపీ మీద‌, మోడీ మీద సోష‌ల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ అయితే మామూలుగా లేదు.