వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఉరఫ్ ఆర్ ఆర్ ఆర్‌ను ఏపీ సీఐడీ పోలీసులు కస్టడీలోకి తీసుకుని.. తనను కొట్టారని.. అరికాళ్లు వాచిపోయేలా తనను చితకబాదారని.. ఆయన పదే పదే చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన హైకోర్టుకు కూడా వెళ్లారు. తాజాగా రఘురామ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. సంచలన ఆదేశాలు జారీ చేసింది. రఘురామను అదుపులోకి తీసుకున్న సమయంలో కాల్ డేటాను స్వాధీనం చేసుకొని భద్ర పరచాలని, కాల్ డేటాను వెంటనే సేకరించాలని సీబీఐకి హైకోర్టు ఆదేశించింది.
కాగా తన కస్టోడియల్ టార్చర్‌పై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. వాదనల సందర్భంగా టెలికం నిబంధనల ప్రకారం రెండు సంవత్సరాలు మాత్రమే కాల్ డేటా ఉంచుతారని రఘురామ తరఫు న్యాయవాది నౌమీన్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే కాల్ డేటాను ప్రిజర్వ్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్దించారు.
తర్వాత సీబీఐ తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ హరినాధ్ వాదనలు వినిపించారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ సిఐడీ వద్ద ఉందని, అందువల్ల కాల్ డేటాను సీఐడీ అధికారులే సేకరించాలని అన్నారు. పిటీషనర్ ఆరోపణలే సిఐడీ మీద అయితే… అదే సంస్థను కాల్ డేటా ఎలా సేకరించమంటారని హైకోర్టు ప్రశ్నించింది. కాగా ఈ కేసులో సీఐడీ ఇంప్లీడ్ పిటీషన్ వేసింది. కాల్ డేటా సేకరించమనడం చట్టవిరుద్దమని సీఐడీ తరపు న్యాయవాది అన్నారు.
ఈ నేపథ్యంలో స్పందించిన న్యాయమూర్తులు సీఐడీ ఇంప్లీడ్ పిటీషన్‌ను ఇంకా అనుమతించలేదని తెలిపారు. సీబీఐకు ఇవ్వాలా… లేదా అనేది కోర్టు ఇంకా నిర్ణయించలేదని, ఈ కేసులో కాల్ డేటా కీలకమని న్యాయవాది నౌమీన్ వాదించారు. దీంతో వెంటనే కాల్ డేటాను సేకరించి భద్రపరచాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశిస్తూ.. కేసు తదుపరి విచారణను వేసవి సెలవుల అనంతరానికి వాయిదా వేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates