కర్ణాటక రిజల్ట్స్ కోసం తెలుగు రాష్ట్రాలలో తెగ వెయిటింగ్

కర్ణాటకలో పోలింగ్ తరువాత మే 13న వెల్లడి కానున్న ఎన్నికల ఫలితాల కోసం అంతా ఎదురుచూస్తున్నారు. అయితే… ఈ ఎదురుచూపులు ఒక్క కర్ణాటకకే పరిమితం కాలేదు. పొరుగునే ఉన్న తెలంగాణ, ఏపీలోనూ ఎదురుచూస్తున్నార. కర్ణాటకలో ఎదురుచూస్తున్నది ప్రజలు, పార్టీలు అయితే.. ఏపీలో మాత్రం రాజకీయ పార్టీలు, కొందరు నాయకులు ప్రత్యేకించి ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

కర్ణాటకలో ఈసారి కాంగ్రెస్ గెలిచి తీరుతుందని చాలా సర్వేలు చెప్పాయి. కాంగ్రెస్ పార్టీ కూడా కర్ణాటకపై భారీగా ఆశలు పెట్టుకుంది. అయితే… చివర్లో హనుమాన్ చాలీసాతో బీజేపీ ఒక్కసారిగా ప్రజల్లో సెంటిమెంట్ రగిలించడంతో పరిస్థితులు మారాయని.. బీజేపీ సొంతంగా పూర్తి మెజారిటీ సాధించలేకపోయినా ఏదోరకంగా మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చాలామంది అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితులలో బీజేపీతో పొత్తులు, బీజేపీలో చేరికల ఆలోచనలలో ఉన్న పార్టీలు, నాయకులు కర్ణాటక ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు.

ముఖ్యంగా తెలంగాణలో చాలాకాలంగా దోబూచులాడుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు 13వ తేదీన కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత బీజేపీలో చేరిక విషయంలో నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన ఆ ఇద్దరు నేతలు బీజేపీలో చేరుతారని భావించినా కొద్దిరోజులు ఎటూ తేల్చకుండా వెయిట్ చేస్తున్నారు. వారి వెయిటింగ్ అంతా కర్ణాటక రిజల్ట్స్ కోసమేననేది విశ్లేషకుల మాట. కర్ణాటక ఎన్నికలలో బీజేపీ కనుక గెలిచి ప్రభుత్వం ఏర్పాటుచేస్తే వీరు ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ అక్కడ చతికిలపడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మాత్రం వీరు కాంగ్రెస్ పార్టీ వైపు చూసే అవకాశాలున్నాయి.

ఇక.. ఏపీలో తెలుగు దేశం పార్టీ బీజేపీతో పొత్తు కోసం పరితపిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ కూడా కర్ణాటక రిజల్ట్స్ కోసం చూస్తోంది. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ క్లియర్ సిగ్నల్స్ ఇప్పటికే పంపించినా బీజేపీ మాత్రం స్పందించడంలేదు. కర్ణాటక ఎన్నికల తరువాత ఆ పార్టీ అవసరాల మేరకు స్పదింస్తుందని చంద్రబాబు వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు.. ఒక వేళ బీజేపీ కనుక కర్ణాటకలో బొక్కబోర్లా పడితే ఆ పార్టీతో పొత్తు విషయంలో చంద్రబాబు ఆలోచనలు కూడా మారొచ్చు.

ఇక తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీలూ కర్ణాటక రిజల్ట్స్ కోసం ఆత్రంగా చూస్తున్నాయి. అక్కడ బీజేపీ గెలిస్తే ఇక్కడ బీజేపీ జోరు పెరగనుంది. కాంగ్రెస్ విషయంలోనూ అదే జరగబోతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ కనుక గెలిస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి మరింత జోరందుకోవడం ఖాయం. ఆయా పార్టీల దిల్లీ అధిష్టానాల నుంచి కూడా సపోర్టు మరింత పెరగనుంది. అదే సమయంలో బీఆర్ఎస్ కూడా ఈ రిజల్ట్ కోసం చూస్తోంది. కర్ణాటక ఫలితాలు అంచనాకు అందకపోవడంతో మిత్రపక్షంగా పైకి చెప్పుకొంటున్న జేడీఎస్ తరఫున ప్రచారానికి కూడా బీఆర్ఎస్ వెళ్లలేదు. అక్కడి ఫలితాలను బట్టి ఏ పార్టీతో ఎలా ఉండాలనేది బీఆర్ఎస్ నిర్ణయించుకోనుంది.

ఇక ఏపీలోని పాలక పార్టీ నేత జగన్ కూడా కర్ణాటక ఫలితాల కోసం చూస్తున్నారట. కేంద్రంలోని బీజేపీతో జగన్‌కు చాలా అవసరాలున్నాయి. ఏపీకి నిధులు, అప్పులు తేవేడంతో పాటు తమ్ముడు అవినాశ్ రెడ్డిని కేసుల నుంచి బయటపడేయడం వంటి విషయాలలో కేంద్రం సహకారం అవసరం. కానీ.. బీజేపీ పైచేయిలో ఉండడంతో జగన్ రిక్వెస్టులు, డిమాండ్లు, అభ్యర్థనలు, ప్రాథేయపడడాలు, వినతులు, కోరికలు, ఆకాంక్షలు ఏవీ నెరవేర్చడం లేదు బీజేపీ పెద్దలు. అదే కర్ణాటకలో ఆ పార్టీ దెబ్బతింటే వచ్చే ఎన్నికలపై ప్రభావం పడుతుందన్న భయంతో తమకు అనుకూలమైన వైసీపీ వంటి పార్టీల అవసరాలు తీర్చే చేతిలో ఉంచుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది. ఇప్పుడు జగన్‌కు కూడా అదే కావాలి. అందుకే.. ఆయన కూడా కర్ణాటక ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే… కర్ణాటకలోని కొందరు తన మిత్రుల గెలుపోటములపైనా ఆయన ఆసక్తిగా ఉన్నారని సమాచారం. ఏపీలో ఎన్నికల సమయంలో నగదు, మద్యం వంటి అవసరాలకు తీర్చే అక్కడి కొందరు మిత్రుల విజయాన్ని కోరుకుంటున్నారట. ఇలా… ఏపీ, తెలంగాణలలో పార్టీలు, నాయకులు కర్ణాటక రిజల్ట్స్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.