ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 30 పైచిలుకు ఎమ్మెల్యేలు.. సీఎం జగన్ అప్పాయింట్‌మెంట్ కోసం వేచి ఉన్నారా? వీరిలో సీనియర్ల నుంచి జూనియర్ల వరకు ఉన్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల కు సంబందించి వీరంతా తమ గోడును వెళ్లబోసుకునేందుకు..జగన్ దర్శనం కోసం తపిస్తున్నారనేది తాడేపల్లి వర్గాలు చెబుతున్న మాట. దాదాపు 100 మందికి పైగా..ధైర్యంగా ఉన్నారు. తమ చరిష్మా పేరు వంటివి తమను కాపాడతాయని వారు విశ్వసిస్తున్నారు.
అయితే..గత ఎన్నికల్లో కొత్తగా గెలిచిన వారు.. జగన్ పాదయాత్ర ఎఫెక్ట్‌తో 1000 నుంచి 1500 లోపు మెజారిటీ దక్కించుకున్నవారు.. మాత్రం ప్రాణాలు చిక్కపట్టుకుని ఉన్నారు. వీరంతా కూడా గెలుపు పై దాదాపు ఆశలు వదిలేసుకున్నట్టుగా వైసీపీలోనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వారంతా కూడా.. తమ సమస్యలు చెప్పుకొనేందుకు వైసీపీ అధినేత దర్శనం కోసం పడిగాపులు పడుతున్నట్టు సమాచారం. విజయవాడలోని కొన్ని హోటళ్లు ఫుల్ అయిపోయాయి.
వరుస నాలుగు రోజుల నుంచి పలు హోటళ్ల ముందు నో రూమ్
బోర్డులు వేలాడుతున్నాయి. వీటిపై ఆరాతీసిన మీడియాకు.. అందరూ వైసీపీ నాయకులేనని తేలిందట. దీంతో మరికొంత లోతుగా వెళ్తే.. ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చి..జగన్ పిలుపు కోసం వారంతా వెయిట్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో రెండు మూడు రోజులుగా బడ్జెట్ హోటళ్లన్నీ హౌస్ ఫుల్ అయిపోయాయని అంటున్నారు. ఇక, ఇప్పటి వరకు తాడేపల్లి నుంచి ఎలాంటి కబురు అందలేదని సమాచారం.
ఇదిలావుంటే.. అసలు వీరి సమస్య ఏంటి? ఇప్పటికిప్పుడు జగన్‌ను కలిసి ఏం చేయాలని అనుకుంటున్నారనే దానిపై రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి.. తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కోరుకునేవారు కొందరు అయితే.. మరికొందరు..అంతర్గత కుమ్ములాటలతో వేడెక్కిపోయి.. అధినేత దగ్గరే తేల్చుకుందామని వచ్చినవారు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో జగన్ సొంత జిల్లా కడపకు చెందిన సీనియర్ నాయకుడు ఒకరు ఉన్నారు. కొన్నాళ్లుగా ఈయనకు సెగ బాగానే ఉంది. ఈ నేపథ్యంలో జగన్ దగ్గర తేల్చుకునేందుకు సిద్ధపడ్డారట. మరి ఇప్పటి వరకు దీనిపై జగన్ దృష్టి పెట్టలేదు. మరిఏం చేస్తారో చూడాలి.