వారెవరికి రాజకీయ నేపథ్యంలో లేదు. ఆ మాటకు వస్తే పార్టీ కార్యకర్తలు కూడా కాదు. ఒక ప్రభుత్వం పిలుపునిస్తే.. తమ బతుకులు బాగుపడటంతో పాటు.. తమ ప్రాంతం రూపురేఖలు మొత్తం మారిపోతాయన్న ఆశతో తమ భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చేశారు. ప్రపంచ చరిత్రలో చుక్క నెత్తురు కారకుండా 33వేల ఎకరాల భూమిని రైతులు తమకు తాముగా ప్రభుత్వానికి ఇచ్చిన అద్భుతమైన ఘట్టం అమరావతి సందర్భంగా చోటు చేసుకుందని చెప్పాలి.
ప్రభుత్వాలు మారి.. వారి ఎజెండాలు మారిపోవటంతో ముందుగా అనుకున్న అమరావతి పక్కకు వెళ్లిపోయి.. దాని స్థానే మూడు రాజధానులకు తెర లేచింది. దీనికి అసెంబ్లీలో ఇప్పటికే బిల్లు పాస్ కావటం.. గవర్నర్ సైతం తాజాగా సంతకం పెట్టేంయటంతో.. సాంకేతిక అంశాలు తప్పించి.. సర్కారు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోయే పరిస్థితి.
ఇలాంటివేళ..రాజధాని నగరం కోసం వేలాది ఎకరాల భూములు ఇచ్చిన రైతులు గడిచిన కొద్ది నెలలుగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. గవర్నర్ సంతకం నేపథ్యంలో వారంతా వినూత్నంగా తమ వేదనను తెలియజేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిలువరించి.. తమకు న్యాయం చేయాలని కోరుతూ.. రోడ్ల మీదకు వచ్చారు.
ఇప్పటికే ఏపీ హైకోర్టులో పెద్ద ఎత్తున పిటిషన్లు వేసిన వారు కొందరైతే.. అందుకుభిన్నంగా తమ ఆవేదనను తెలియజేసేందుకు వీలుగా వందలాది మంది పెద్దలు.. మహిళలు.. చిన్నారులు రోడ్డుకు ఇరువైపులా మానవహారంగా మారటం.. కొందరైతే మోకాళ్ల మీద తమ వేదననుతెలియజేసేలా చేశారు.
హైకోర్టున్యాయమూర్తులు తమ నివాసాల నుంచి హైకోర్టుకు వెళ్లే మార్గంలో బాధితులు పెద్ద ఎత్తున నిర్వహించిన మానవహారం సరికొత్త సన్నివేశంగా అభివర్ణించాలి. చూసినంతనే అయ్యో అనుకునేలా చేసిన వారు.. ఎలాంటి నినాదాలు చేయకుండా.. చేతులు జోడించి.. తమకు న్యాయం చేయాలని పేర్కొన్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. వందలాదిగా కిలోమీటర్ల కొద్దీ మానవహారంగా మారిన అమరావతి రైతుల తీరు.. హైకోర్టు న్యాయమూర్తులను ఆకర్షించిందా? అన్న సందేహం కలుగక మానదు.
దీనికి తగ్గట్లే.. ఏపీ రాజధానిపై స్టేటస్ కోను జారీ చేయటమే కాదు.. ప్రభుత్వాన్ని కౌంటర్ వేయాలని కోరారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతానికి చెందిన రైతులు 231 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. అమరావతిని రక్షించాలని.. తమ జీవితాల్ని కాపాడాలంటూ ప్లకార్డులు పట్టుకొని వారు మౌనంగా నిలుచున్నారు.
ఇప్పటివరకూ చాలానే నిరసనలు.. ఆందోళనలు చోటు చేసుకున్నాయి కానీ అందుకు భిన్నంగా అమరావతి రైతులు నిర్వహించిన నిరసన అత్యంత క్రమశిక్షణతో పాటు.. అయ్యో ఎలాంటి కష్టం అన్న భావన కలిగించేలా తాజా నిరసన సాగిందని చెప్పక తప్పదు.