శరద్ పవార్‌కు ఏమైంది ?

రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదివికి రాజీనామా చేశారు. అయితే రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని, పార్టీ కార్యకర్తలకు అండగా వారికి మార్గదర్శిగా ఉంటానని ప్రకటించారు. 1999లో ఏర్పాటైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) కి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను మొదలు పెట్టాలని పవార్ తమ పార్టీ నేతలకు సూచించారు. ఆరు దశాబ్దాలుగా మహారాష్ట్ర ప్రజల సేవలో ఉన్నానని, ఆ అవకాశం కల్పించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని పవార్ అన్నారు.
అభిమానుల నిరసన

ఒక పుస్తకావిష్కరణలో పవార్ ఈ ప్రకటన చేసిన వెంటనే పార్టీ శ్రేణులు తీవ్ర షాక్‌కు లోనయ్యాయి. చాలా మంది కంట తడి పెట్టారు. వద్దు వద్దంటూ ఆయన్ను వారించారు. నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలని అభ్యర్థించారు. తామెవ్వరికీ చెప్పకుండా పవార్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారని కేంద్ర మాజీ మంత్రి ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ వెల్లడించారు.

అజిత్ మాట..
శరద్ పవార్ నిర్ణయం తనకు ముందే తెలుసని మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అన్నారు. మే 1నే ఆయన ఈ ప్రకటన చేయాలనుకున్నా… కార్యకర్తలందరికీ తెలిసేందుకు ఒక రోజు ఆగాలని తాను కోరినట్లు అజిత్ వెల్లడించారు. శరద్ పవార్ ఇక నిర్ణయం మార్చుకోరన్న సంగతి తనకు తెలుసన్నారు..

టెన్షన్‌లో శరద్
శరద్ పవార్ కొద్దిరోజులుగా టెన్షన్‌లో ఉన్నారు. తన బంధువే అయిన అజిత్ పవార్ ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీని చీల్చే ప్రయత్నంలో ఉన్నారని ఆయనకు తెలిసిపోయింది. కర్ణాటక ఎన్నికల తర్వాత కొంత మంది ఎమ్మెల్యేలను తీసుకుని అజిత్ పవార్ బీజేపీ వైపు ఫిరాయిస్తారని శరద్ భావిస్తున్నారు. ఆ పరిస్థితుల్లో తాను పార్టీ అధ్యక్షుడిగా ఉండటం శ్రేయస్కరం కాదని శరద్ పవార్ భావిస్తున్నారు..

తగ్గుతున్న పట్టు

మహారాష్ట్ర రాజకీయాల్లో తన పట్టు తగ్గుతోందని శరద్ పవార్ భావిస్తున్నారు. రాజకీయాల్లో ఎక్కువ పార్టీలు ఉండటం సంకీర్ణాల యుగంలో అవకాశం వస్తే వేరే వారిని లాగేయ్యాలని ప్రయత్నించడం ఆయనకు సుతారమూ నచ్చలేదు. మహారాష్ట్రలో బీజేపీ రాజకీయాల పట్ల పవార్ విసిగిపోయారని ఆయన సన్నిహితులంటున్నారు. ఎంత సంయమనం పాటించినా బీజేపీ విసిగిస్తూనే ఉందని శరద్ పవార్ చాలా సార్లు వాపోయారట. కొట్టి బతకడం మినహా బీజేపీకి పురోగామి రాజకీయాలు తెలివయని పవర్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొంత బర్డెన్ తగ్గించుకోవడమే తగిన మార్గమని ఆయన భావిస్తున్నారట…